Mulugu: దొడ్ల వద్ద పొంగిన జంపన్న వాగు

Mulugu: దొడ్ల వద్ద పొంగిన జంపన్న వాగు
కొండాయి గ్రామంలో వరద ఉదృతికి 8 మంది మృతి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీసిన గ్రామస్థులు

ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం దొడ్ల వద్ద జంపన్న వాగు పొంగి పోర్లడంతో కొండాయి గ్రామం నీట మునిగింది. వరద ఉదృతికి 8 మంది ప్రాణాలు కోల్పోయారు. కొండాయి గ్రామంలోకి వరద నీరు చేరడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీశారు. వరద తగ్గిన తర్వాత తిరిగి గ్రామంలోకి వెళితే ఇంట్లోని నిత్యావసర వస్తువులు అన్ని వరద నీటిలో కొట్టుకుపోయి. సర్వం కోల్పోయామని బాధితులు వాపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటి వరకూ తమకు ఎటువంటి సహాయం అందించలేదని అంటున్నారు. బురదలో నేలమట్టమైన ఇళ్లను చూసి గ్రామస్థులు కంటతడి పెట్టారు.

తలదాచుకోవడానికి ఇల్లు, కట్టు కోవడానికి బట్టలు కూడా లేవని.. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు. ఇళ్లు కూలిపోయిన వారికి డబుల్ బెడ్ రూం ఇల్లు, పంట పొలాలకు నష్ట పరిహారం చెల్లించాలని బాధితులు అంటున్నారు. ఇప్పటికైతే ప్రభుత్వం ఎటువంటి ఆర్థిక సహాయం చేయలేదని స్వచ్ఛంద సంస్థలు, అధికారులు వచ్చి తోచినంత సహాయం చేస్తున్నారని వాపోయారు. సర్వం కోల్పోయిన తమకు శాశ్వత ఇళ్ల నిర్మాణం, నష్ట పరిహారం చెల్లించాలని కొండాయి గ్రామస్థులు కోరుతున్నారు.

ములుగు ఎమ్మెల్యే సీతక్క పిలుపు మేరకు RDT స్వచ్ఛంద సంస్థ కొండాయి, దొడ్ల, మల్యాల, కొత్తూరు గ్రామస్థులకు 16 లక్షల 20 వేల రూపాయలతో నిత్యావసర వస్తువులు, నెల రోజులకు సరిపడా బియ్యం పంపిణీ చేశారు. ప్రభుత్వం స్పందించక పోయిన స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి తమను ఆదుకుంటున్నాయని గ్రామస్థులు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story