KCR: ముగ్దూంపూర్ లో ఎండిన పంటలను పరిశీలించిన కేసీఆర్

KCR: ముగ్దూంపూర్ లో ఎండిన పంటలను పరిశీలించిన కేసీఆర్
చేతి కర్రతోనే పొలం బాట

కరీంనగర్‌ జిల్లా ముగ్ధుంపూర్‌లో ఎండిన పంటలను పరిశీలించిన కేసీఆర్‌ నీటి సమస్యపై రైతులను అడిగి తెలుసుకున్నారు. రామడుగు మండలం వెదిర, గంగాధర మండలం కురిక్యాల గ్రామాల్లో పర్యటించిన ఆయన వాహనం నుంచి దిగి రైతుల నుంచి వినతి పత్రాలు తీసుకున్నారు. తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో పంట పొలాలను పరిశీలించిన భారాస అధినేత వద్ద ఎండిన పొలాలను చూపుతూ రైతులు తమ సమస్యలను వివరించారు. మధ్యమానేరు ప్రాజెక్టు ముంపు ప్రాంతాలు పరిశీలించిన కేసీఆర్‌... కాంగ్రెస్‌ ప్రభుత్వం మోసపూరిత హామీలతో అధికారానికి వచ్చిందన్నారు. ఇది కాలం తెచ్చిన కరవు కాదని, కాంగ్రెస్‌ తెచ్చిన కరవేనని విమర్శించారు.

రాష్ట్రంలో లక్షల ఎకరాల్లో పంటలు ఎండి రైతన్న కన్నీళ్లు పెడుతుంటే, కాంగ్రెస్ ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్టయినా లేదని బీఆర్ఎస్ఆ రోపిస్తోంది. దిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతూ, సీఎం రేవంత్ రెడ్డి రాజకీయాలలో బిజీగా ఉన్నారని ఆరోపిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపిస్తూ, నీళ్లందక ఎండిన పంట పొలాలను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరిశీలించారు.

మేడిగడ్డ బ్యారేజీలోని 300 పిల్లర్లలో మూడు కుంగిపోతే... ప్రపంచం మునిగినట్లు కాంగ్రెస్‌ ప్రభుత్వం మాట్లాడుతోందని కేసీఆర్‌ మండిపడ్డారు. బ్యారేజీల నిర్మాణంలో... చిన్నచిన్న పొరపాట్లు జరగటం సహజమేనన్న ఆయన..వెంటనే అక్కడి నుంచి నీటిని ఎత్తిపోయాలని డిమాండ్‌ చేశారు. రైతు బంధు విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని చెప్పకుండా అన్నదాతల్లో గందరగోళం సృష్టిస్తోందని కేసీఆర్‌ మండిపడ్డారు. గతంలో ఇచ్చినట్టు రైతు బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ ప్రయాణిస్తున్న బస్సును పోలీసులు, ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు. సూర్యాపేట జిల్లా ఈదుల పర్రె తండా చెక్ పోస్ట్ వద్ద కేసీఆర్‌ వాహనాన్ని ఆపిన ఎన్నికల అధికారులు, పోలీసులు విధి నిర్వహణలో భాగంగా తనిఖీ చేశారు. ఎన్నికల కోడ్ను అనుసరించి పోలీసులకు కేసీఆర్‌ సహకరించారు. కేసీఆర్‌ బస్సుతో పాటు ఆయన వెంట వస్తున్న వాహనాలను పోలీసులు తనిఖీ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story