Akbaruddin Owaisi: అక్బరుద్దీన్‌ హేట్‌ స్పీచ్‌పై తీర్పును వాయిదా వేసిన నాంపల్లి కోర్టు..

Akbaruddin Owaisi (tv5news.in)

Akbaruddin Owaisi (tv5news.in)

Akbaruddin Owaisi: MIM ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఓవైసీ హేట్‌ స్పీచ్‌పై నాంపల్లి కోర్టు తీర్పును రేపటికి వాయిదా వేసింది.

Akbaruddin Owaisi: MIM ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఓవైసీ హేట్‌ స్పీచ్‌పై నాంపల్లి కోర్టు తీర్పును రేపటికి వాయిదా వేసింది. 10 ఏళ్లపాటు దీనిపై విచారణ జరిగింది.. 2012 డిసెంబర్‌ 22న నిర్మల్‌ సభలో, తర్వాత ఆదిలాబాద్‌లో హిందువులపైన, హిందూ దేవతలపైన అక్బర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఆయన మాట్లాడిన తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై ఐపీసీ సెక్షన్‌ 120-B, 153-A, 295, 298, 188 సెక్షన్ల కింద సుమోటోగా పోలీసులే కేసు నమోదు చేశారు.

అరెస్టు చేసే లోపు అక్బర్‌ లండన్‌ వెళ్లడంతో అక్కడి నుంచి తిరిగి రాగానే అదుపులోకి తీసుకున్నారు. కుట్ర, విద్వేషాలు రెచ్చగొట్టడం, మతపరమైన విశ్వాసాన్ని కించపరచడం లాంటి సెక్షన్ల నేపథ్యంలో అరెస్టు చేశారు. ఈ కేసుల్లో 40 రోజులు జైల్లో ఉన్నారు. తర్వాత బెయిల్‌పై విడుదలైనా కొన్నిసార్లు విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో కనుక నేరం రుజువైతే అక్బరుద్దీన్‌కు 2 ఏళ్లు శిక్ష పడే అవకాశం ఉంది. తీర్పు నేపథ్యంలో నిర్మల్‌, భైంసాలో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

హైదరాబాద్‌ పాతబస్తీలోనూ భద్రత కట్టుదిట్టం చేశారు. నిర్మల్‌లోని మున్సిపల్‌ గ్రౌండ్స్‌లో మజ్లిస్ ఏర్పాటు చేసిన బహిరంగసభ సభలో అక్బరుద్దీన్‌ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. మీరు 100 కోట్ల మంది.. మేం 25 కోట్ల మందే.. 15 నిమిషాలు పోలీసులు పక్కకుపెడితే ఎవరిలో దమ్ముందో చూపిస్తామంటూ రెచ్చగొట్టేలా మాట్లాడారు. ఆదిలాబాద్‌ సభలో హిందూ దేవతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు కేసుల్లో విచారణ పూర్తైన నేపథ్యంలో కోర్టు తీర్పు ఉత్కంఠ రేపుతోంది.

Tags

Read MoreRead Less
Next Story