KADIAM: ఫలిస్తున్న కాంగ్రెస్‌ ఆకర్ష్‌

KADIAM: ఫలిస్తున్న కాంగ్రెస్‌ ఆకర్ష్‌
కాంగ్రెస్‌ గూటికి కడియం.... ఒక్కొక్కరుగా బీఆర్‌ఎస్‌ను వీడుతున్న నేతలు

కాంగ్రెస్ ఆకర్ష్ విధానం ఫలించి బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి నేతలు వరుస కడుతున్నారు. బీఆర్‌ఎస్‌ను వీడబోమంటూ ఖరాఖండీగా చెప్పిన నేతలే..హస్తంపార్టీలో చేరుతున్నారు. మంత్రి, ఉపముఖ్యమంత్రి, ఎంపీ, ఎమ్మెల్సీ, MLAగా ఎన్నో పదవులు నిర్వహించిన స్టేషన్ ఘన్‌పూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి కాంగ్రెస్ గూటికి చేరారు. హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పార్టీ ఇంఛార్జీదీపాదాస్‌ మున్షి కడియం శ్రీహరి, కావ్యలకు...పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇక వరంగల్ లోక్‌సభ స్ధానంలో కాంగ్రెస్ అభ్యర్ధిగా కడియం కావ్య..పోటీలో నిలవనున్నారు. లోక్‌సభ ఎన్నికల ముంగిట నాయకుల పార్టీ మార్పులు జోరందుకున్నాయి. స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే...కడియంశ్రీహరి ఆయన కుమార్తె కావ్యలు..కాంగ్రెస్ గూటికి చేరారు. కాంగ్రెస్‌ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ...ఇతర నేతలు కడియం నివాసానికి వెళ్లి వారిద్దరినీ...పార్టీలోకి ఆహ్వానించగా.. కార్యకర్తల అభిప్రాయం మేరకు ఇరువురు కాంగ్రెస్‌ గూటికి చేరారు.


వృత్తిరీత్యా అధ్యాపకుడిగా పనిచేసి విద్యార్ధులకు పాఠాలు బోధించిన కడియం శ్రీహరి దివంగత ముఖ్యమంత్రి NTR ఆహ్వానంతో1987 ఫిబ్రవరిలో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 1994లో తొలిసారిగా స్టేషన్‌ఘనపూర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి గెలుపొంది NTR హయాంలో మంత్రిగా పనిచేశారు. 1999లో మళ్లీ అదే స్థానం నుంచి గెలిచి చంద్రబాబు సర్కార్‌లో అమాత్యుడిగా విధులు నిర్వర్తించారు. ప్రత్యేకరాష్ట్ర ఉద్యమం ఉవ్వెత్తున సాగిన సమయంలో 2013లో తెదేపాను వీడి..... గులాబీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 2014లో వరంగల్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. 2015లో అనూహ్యంగా తాటికొండ రాజయ్య స్ధానంలో ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ MLA రాజయ్యని పక్కనపెట్టి MLCగా ఉన్న కడియం శ్రీహరికి స్టేషన్‌ఘన్‌పూర్ టికెట్ ఇచ్చారు. ఇరువురు పరస్పర విమర్శలతో నిత్యంవార్తల్లో నిలిచారు. కాంగ్రెస్ గాలిని ఎదుర్కొని ప్రత్యర్ధి కాంగ్రెస్ అభ్యర్ధి ఇందిరపై విజయం సాధించారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 10స్ధానాలు కాంగ్రెస్ కైవసం చేసుకోగా..కేవలం రెండు స్ధానాలకే..భారాస పరిమితమైంది. అందులో ఒకటి స్టేషన్ ఘన్‌పూర్.


మూడున్నర దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో అనర్గళంగా మాట్లేడేనేతగా గుర్తింపుపొందారు.అసెంబ్లీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమర్ధవంతంగా కడియం తన గళం వినిపించారు. కాంగ్రెస్ సర్కార్ ఆర్నెళ్లలో కూలిపోవడం ఖాయమని సంచలన వ్యాఖ్యలు చేశారు. వారసురాలిగా తన కుమార్తెను రాజకీయాల్లోకి తీసుకురావాలన్నది శ్రీహరి కల. అందులోభాగంగానే లోక్‌సభ ఎన్నికల్లో వరంగల్ నుంచి కడియం కావ్యకు భారాస టిక్కెట్ దక్కించుకోగలిగారు. మారిన రాజకీయ పరిస్ధితులు, భారాస అధినాయకత్వంపై అవినీతి ఆరోపణలు పార్టీకి అప్రతిష్ట తెచ్చాయని కడియం భావిస్తున్నారు. జిల్లా నాయకులు తన కూతురుకు సహకరించట్లేదన్నది కడియం వాదన. ఈ పరిస్ధితుల్లో కావ్య పోటీచేస్తే ఓటమి తప్పదని గ్రహించిన ఆయన పోటీ నుంచి వైదొలిగి కాంగ్రెస్‌లో చేరారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత కడియం శ్రీహరికి రేవంత్‌రెడ్డి మంత్రివర్గంలో బెర్తు ఖాయమనే ప్రచారం జరుగుతోంది.

Tags

Read MoreRead Less
Next Story