తెలంగాణ

Bandi Sanjay: బండి సంజయ్‌ టార్గెట్‌గా కరీంనగర్‌లో బీజేపీ అసంతృప్తి నేతల భేటీ..

Bandi Sanjay: తెలంగాణలో బీజేపీ మంచి జోరు మీదుంది. టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొంటూ.. రోజురోజుకు బలం పెంచుకుంటోంది బీజేపీ.

Bandi Sanjay (tv5news.in)
X

Bandi Sanjay (tv5news.in)

Bandi Sanjay: తెలంగాణలో బీజేపీ మంచి జోరు మీదుంది. టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొంటూ.. రోజురోజుకు బలం పెంచుకుంటోంది బీజేపీ. ముఖ్యంగా.. బండి సంజయ్‌ తెలంగాణ బీజేపీ చీఫ్‌గా మారినప్పటినుంచి.. ఆ పార్టీ కార్యకర్తల్లో జోష్‌ పెరిగింది. దీంతో వరసు విజయాలు నమోదవుతున్నాయి. అటు.. ఏదో ఒక అంశంతో.. బండి సంజయ్‌ తెలంగాణ రాజకీయాలను హీటెక్కిస్తున్నారు.

ఇలాంటి తరుణంలో.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ టార్గెట్‌గా కరీంనగర్‌లో జరిగిన ఆ పార్టీ అసంతృప్త నేతల సమావేశ వ్యవహారం.. తీవ్ర దుమారం రేపుతోంది. బండి సంజయ్‌కు వ్యతిరేకంగా.. రహస్యంగా జరిగిన ఈ మీటింగ్‌లో.. పార్టీలో దశాబ్ధాలుగా ఉంటున్న నేతలు ఉన్నట్లు తేలింది. అటు.. గత కొద్దిరోజులుగా ఈ అంతర్గత సమావేశాలు జరుగుతున్నట్లు గుర్తించిన బీజేపీ నాయకత్వం.. పార్టీని దెబ్బతీసేలా సమావేశాలు నిర్వహిస్తున్న నేతలపై చర్యలకు సిద్ధమవుతోంది.

దీనిపై ఇప్పటికే నిఘా పెట్టిన పార్టీ నాయకత్వం.. సమావేశాల్లో పాల్గొన్న నేతల పేర్లను సేకరిస్తోంది. కరీంనగర్‌ నుంచి మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, కిసాన్‌ మోర్చా మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సుగుణాకరరావు, వరంగల్‌ నుంచి మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, రాజేశ్వరరావు, నల్గొండ నుంచి మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింత సాంబమూర్తి, మహబూబ్‌నగర్‌ నుంచి నాగురావు నామోజీ, హైదరాబాద్‌ నుంచి వెంకట రమణి, వెంకట్‌రెడ్డి, నిజామాబాద్‌ నుంచి అల్జాపూర్‌ శ్రీనివాస్‌, మల్లారెడ్డి, ఆదిలాబాద్‌ నుంచి గోనె శ్యామ్‌సుందర్‌రావు ఈ రహస్య సమావేశంలో పాల్గొన్నట్లు తేలింది.

ఇప్పటికే పలుమార్లు రహస్య సమావేశాలు నిర్వహించిన ఈ అసంతృప్త నేతలు.. పార్టీలో మిగిలిన అసంతృప్తవాదులు అందరినీ ఒక్కతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేసినట్లు పార్టీ నాయకత్వం సమాచారం రాబట్టింది. ఈ అసంతృప్త నేతలు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో కూడా సమావేశమై తమ అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు సమాచారం.

ఈ వ్యవహారాన్ని బీజేపీ అధిష్టానం సీరియస్‌గా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో బీజేపీ రాష్ట్ర చీఫ్‌ బండి సంజయ్‌.. సీనియర్‌ నేత ఇంద్రసేనారెడ్డితో సమావేశమయ్యారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డవారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నదానిపై తీవ్రంగా చర్చించారు. కరీంనగర్‌కు చెందిన ఇద్దరు నేతలపై వేటు వేయాలని అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

Divya Reddy

Divya Reddy

Divya reddy is an excellent author and writer


Next Story

RELATED STORIES