మహిళను మెకానిక్‌గా మార్చిన పేదరికం.. అండగా నిలిచిన ఎమ్మెల్సీ కవిత

మహిళను మెకానిక్‌గా మార్చిన పేదరికం.. అండగా నిలిచిన ఎమ్మెల్సీ కవిత
వాహనాల పంచర్లు, మెకానిక్ పనిచేస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తోంది ఆదిలక్ష్మి.

పేదరికం ఆదిలక్ష్మి అనే మహిళను మెకానిక్ గా మార్చింది. పిల్లల పోషణకోసం భర్తతో కలిసి వాహనాల పంచర్లు, మెకానిక్ పనిచేస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తోంది. మగాళ్లకు దీటుగా మెకానిక్ గా మారి తెలంగాణాలోనే మొదటి మహిళా మెకానిక్‌గా మారింది. వీరిది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి. ఈమె భర్త వీరభద్రం బతుకుదెరువుకోసం సుజాత నగర్‌లో మెకానిక్ షాపు పెట్టారు. భర్త పంక్చర్లుచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కానీ ఇల్లుగడువడం కష్టంగా మారడంతో ఆదిలక్ష్మి భర్తకు తోడుగా పంక్చర్ షాపుకు వెళ్లి పనులు నేర్చుకుంది. బంధువులు, స్నేహితులు ఎగతాళిచేసినా ...అవేమి పట్టించుకోకుండా.. మెకానిక్‌గా పని కొనసాగిస్తోంది.

మెకానిక్ పనులు చేస్తున్న ఆదిలక్ష్మి గురించి తెలుసుకున్న ఎమ్మెల్సీ కవిత.. నేరుగా ఆమెతో మాట్లాడి అభినందించారు. ఆమెషాపుకు కావాల్సిన అధునాతన మెషిన్లను అందిస్తామని హామీ ఇచ్చారు. వారి ఇద్దరు పిల్లలను చదివించే బాధ్యత తీసుకుంటామన్నారు. మహిళలు ప్రయత్నిస్తే ఏదైనా సాధించగలరని ఆదిలక్ష్మి జీవితమే అందుకు నిదర్శనమని కవిత అన్నారు. అయితే అడగకుండానే తమకుటుంబానికి అండగా నిలిచిన ఎమ్మెల్సీ కవితను మెకానిక్ ఆదిలక్ష్మి కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

ఆదిలక్ష్మి మెకానిక్ గా రాణించడానికి ఆమె భర్త వీరభద్రం ప్రోత్సాహం కూడా ఎంతో ఉంది. బంధువులు, స్నేహితులు ఎగతాళి చేసినా.. తన భర్త ప్రోత్సాహంతోనే వెనుకడుగు వేయలేదని అంటోంది ఆదిలక్ష్మి. ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తే తానే కొత్తషాపు పెట్టుకుంటానని చెప్పింది.

Tags

Read MoreRead Less
Next Story