KCR: గవర్నర్‌ తమిళిసై, సీఎం కేసీఆర్ మధ్య ఆత్మీయ పలకరింపులు.. 9 నెలల తర్వాత..

KCR: గవర్నర్‌ తమిళిసై, సీఎం కేసీఆర్ మధ్య ఆత్మీయ పలకరింపులు.. 9 నెలల తర్వాత..
KCR: ఇద్దరూ ఎదురుపడ్డారు. చిరునవ్వుతో పలకరించుకున్నారు. కుశలప్రశ్నలు వేసుకున్నారు. పుష్పగుచ్చాలూ చేతులుమారాయి.

KCR: ఇద్దరూ ఎదురుపడ్డారు. చిరునవ్వుతో పలకరించుకున్నారు. కుశలప్రశ్నలు వేసుకున్నారు. పుష్పగుచ్చాలూ చేతులుమారాయి. తేనీటి విందులోనూ మాటలు కొనసాగాయి. ఈ దృశ్యం చూస్తుంటే.. సీఎం కేసీఆర్‌కి- గవర్నర్‌ తమిళిసైకి మధ్య అంతరాలు తొలిగాయా అనిపించింది. దాదాపు 9 నెలలుగా గవర్నర్‌ పాల్గొనే కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్న KCR చివరికి ఇవాళ రాజ్‌భవన్‌లో అడుగుపెట్టారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్‌ భుయాన్‌ ప్రమాణస్వీకారానికి హాజరయ్యారు.

అదే కార్యక్రమానికి వచ్చిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సహా మరికొందరు BJP నేతల్నీ KCR, మంత్రులు మర్యాదపూర్వకంగా పలకరించారు. తర్వాత హై-టీలో గవర్నర్‌తో నవ్వుతూనే ముచ్చటించారు ముఖ్యమంత్రి. అధికారిక కార్యక్రమం కాబట్టి CJI ప్రమాణంలో సభా మర్యాదలు పాటించేలా ఈ దృశ్యాలు కనిపించినా.. ఇకపై రాజ్‌భవన్‌కి- ప్రగతిభవన్‌కి మధ్య సత్సంబంధాలే ఉంటాయని స్పష్టంగా చెప్పలేని పరిస్థితైతే కనిపిస్తోంది. హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఉజ్జల్ భుయాన్‌ ప్రమాణస్వీకారానికి KCR హాజరు అవుతారా లేదా అనే దానిపై ముందుగా పెద్ద చర్చే జరిగింది.

గవర్నర్‌ తమిళిసైకి, సీఎం కేసీఆర్‌కీ మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరిన నేపథ్యంలో.. CM రాజ్‌భవన్‌కు వెళ్లకపోవచ్చనే ఊహాగానాలు వచ్చాయి. ఐతే.. ప్రొటోకాల్ ప్రకారం CJ ప్రమాణానికి హాజరుకావాలని KCR నిర్ణయించుకున్నారు. గతంలో ప్రధాన న్యాయమూర్తుల ప్రమాణస్వీకారాలకు హాజరైనట్టే.. ఇప్పుడూ సంప్రదాయం పాటించారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు, అధికారులు కూడా వెళ్లారు. ఏడాదిగా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏర్పడిన విభేదాల ప్రభావం ప్రగతిభవన్‌, రాజ్‌భవన్‌ మధ్య స్పష్టంగా కనిపించింది. 9 నెలలుగా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కూడా గవర్నర్‌ బంగ్లాకు సీఎం కేసీఆర్‌ వెళ్ల లేదు.

ఈ పరిస్థితుల్లోనే ఇవాళ్టి CJ ప్రమాణస్వీకారం అందరి దృష్టిని ఆకర్షించింది. KCR ఈ కార్యక్రమానికి గైర్హాజరైతే.. తన బదులుగా న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డితోపాటు ఉన్నతాధికారులు పంపాలని నిర్ణయించుకున్నట్టు ముందుగా వార్తలు వచ్చాయి. చీఫ్‌ జస్టిస్‌ భూయాన్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం కేసీఆర్‌ స్వయంగా ఆయన నివాసానికి వెళ్లి కలుస్తారనే టాక్‌ వినిపించింది. కానీ KCR రాజ్‌భవన్‌ గడప తొక్కారు. తమిళిసై గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన మొదట్లోనూ కేసీఆర్‌ అన్ని కార్యక్రమాలకు హాజరయ్యే వారు. కానీ, ఏడాది కాలంగా పరిస్థితిలో పూర్తి మార్పు వచ్చింది..

గవర్నర్‌ ప్రసంగం లేకుండానే బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించడం, రిపబ్లిక్‌డే వేడుకలకు ఆయనతోపాటు మంత్రులను దూరం పెట్టడం.. సమ్మక్క, సారలమ్మ జాతరలో ప్రొటోకాల్‌ పాటించలేదని గవర్నర్‌ విమర్శించడం.. మొన్నటి యాదాద్రి ఆలయ ఉద్ఘాటనకు ఆహ్వానించడకపోవడం వంటి నిర్ణయాలతో గవర్నర్‌, ముఖ్యమంత్రి మధ్య దూరం మరింత పెరిగింది. ఇక రాజ్‌భవన్‌లో గవర్నర్ నిర్వహించిన ప్రజా దర్బార్‌ అయితే రాజకీయ రచ్చ రాజేసింది.

సమస్యల పరిష్కారం కోసమే ప్రజా దర్బార్ నిర్వహించామని గవర్నర్‌ చెప్తే.. రాజ్‌భవన్‌ను రాజకీయాలకు వేదిక చేశారంటూ గులాబీ శ్రేణులు గట్టిగానే విరుచుకుపడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇవాళ ఒకే వేదికపై గవర్నర్‌ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్‌ కనిపించారు. ఈ సఖ్యత ఎన్నాళ్లు ఉంటుంది.. రాజకీయాలకు అతీతంగా ఇకపై అన్నీ జరుగుతాయా అనేది వేచి చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story