BRS: బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థుల ప్రకటనకు రంగం సిద్ధం

BRS: బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థుల ప్రకటనకు రంగం సిద్ధం
తుది కసరత్తు చేస్తున్న కేసీఆర్‌... త్వరలో ఆరు స్థానాలకు ఎంపీ అభ్యర్థుల ప్రకటన

భారత రాష్ట్ర సమితి మిగిలిన స్థానాలకు పార్టీ అభ్యర్థులను ప్రకటించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన గులాబీ పార్టీ... మిగిలిన ఆరు స్థానాలకు పేర్లు ఖరారు చేయాల్సి ఉంది. మెదక్, నాగర్ కర్నూల్ స్థానాలపై పూర్తి స్పష్టత ఉంది. అయితే నల్గొండ, భువనగిరి పైనే ఇంకా స్పష్టత రాలేదని అంటున్నారు. సికింద్రాబాద్, హైదరాబాద్ స్థానాలకు కూడా బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌తో తెలంగాణ రాజకీయం వేడెక్కింది. ఇప్పటికే పార్టీలు కొన్ని అభ్యర్థిత్వలను ఖరారు చేశాయి. ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి ఇప్పటి వరకు 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన ఆరు సీట్లలో పార్టీ తరపున లోక్‌సభఎన్నికల్లో బరిలో దిగే వారి పేర్లను ప్రకటించాల్సి ఉంది. ఇందులో హైదరాబాద్ జిల్లాకు చెందిన రెండు స్థానాలతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన రెండు లోక్‌సభసీట్లు ఉన్నాయి.


మెదక్, నాగర్ కర్నూల్ అభ్యర్థిత్వాలను కూడా ప్రకటించాల్సి ఉంది. మొదట పొత్తులో భాగంగా నాగర్ కర్నూల్, హైదరాబాద్ సీట్లను బహుజన సమాజ్ పార్టీకి కేటాయించారు. అయితే పొత్తు విఫలం కావడంతో ఆ రెండు స్థానాల్లోనూ గులాబీ పార్టీ అభ్యర్థులను బరిలో దించాల్సి ఉంది. నాగర్ కర్నూల్ స్థానానికి తెలంగాణ BSP మాజీ అధ్యక్షుడు, గులాబీ కండువా కప్పుకున్న విశ్రాంత ఐపీఎస్ అధికారి RS ప్రవీణ్ కుమార్ పేరు ఖాయమైంది. ఆయన అభ్యర్థిత్వాన్ని బీఆర్‌ఎస్‌ అధినేత KCR లాంఛనంగా ప్రకటించాల్సి ఉంది. మెదక్ లోక్‌సభ అభ్యర్థిగా వంటేరు ప్రతాప్ రెడ్డి పోటీ దాదాపు ఖాయమే. సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నారు. సికింద్రాబాద్ లోక్‌సభస్థానానికి తలసాని సాయికిరణ్ యాదవ్, రావుల శ్రీధర్ రెడ్డి, దాసోజు శ్రవణ్ పేర్లు వినిపిస్తున్నాయి.

ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన రెండు లోక్‌సభస్థానాల అభ్యర్థిత్వాలు ఇంకా ఓ కొలిక్కి రాలేదని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. నల్గొండ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి పేరు బాగా వినిపిస్తోంది. చెరుకు సుధాకర్ కూడా రేసులో ఉన్నారు. భువనగిరి లోక్‌సభస్థానానికి మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్, సీనియర్ నేతలు జిట్టా బాలకృష్ణారెడ్డి, క్యామ మల్లేష్ తో పాటు ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి తనయుడు ప్రశాంత్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. లోక్‌సభ అభ్యర్థిత్వాల విషయమై ఆయా నియోజకవర్గాల పరిధిలోని నేతలతో KCR సంప్రదింపులు జరుపుతున్నారు. వారి అభిప్రాయాలు తీసుకుంటున్నారు. ఒకటి, రెండు రోజుల్లోనే మిగిలిన ఆరు స్థానాలకు అభ్యర్థిత్వాల ప్రకటన పూర్తవుతుందని గులాబీ పార్టీ వర్గాలు చెప్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story