KCR: రాబోయేది ప్రాంతీయ పార్టీల యుగమే

KCR: రాబోయేది ప్రాంతీయ పార్టీల యుగమే
అభ్యర్థుల గుణగణాలు చూసి ఓటేయండి.. ప్రజలకు కేసీఆర్‌ పిలుపు

తెలంగాణలో ఎన్నికల ప్రచారాన్ని ఉద్ధృతం చేసిన బీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ కొత్తగూడెం, ఖమ్మం ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఎన్నికలు రాగానే ప్రజలు గందరగోళానికి గురికావొద్దని అభ్యర్థి గుణగణాలు, పార్టీల వైఖరీ, చరిత్ర చూసి ఓటు వేయాలని సూచించారు. సమైక్య రాష్ట్రం ఉంటే కొత్తగూడెం జిల్లా అయ్యేది కాదన్నారు. కొత్తగూడానికి ప్రభుత్వ వైద్యకళాశాల వచ్చేదా అని ప్రశ్నించారు. సీతారామ ప్రాజెక్టు 70 శాతం పూర్తైందని తానే వచ్చి ప్రారంభిస్తానని చెప్పారు. 50 ఏళ్ల కాంగ్రెస్‌ పాలనలోకాని పనులను ఈ 9ఏళ్లలోనే చేశామని తెలిపారు. వంద శాతం సింగరేణి వాటా తెలంగాణ ఆధ్వర్యంలో ఉన్నదాన్ని కాంగ్రెస్‌ నాయకుల వల్ల సగం వాటా కేంద్రానికి కట్టబెట్టాల్సి వచ్చిందని కేసీఆర్‌ ఆక్షేపించారు.


అనంతరం ఖమ్మం సభలో పాల్గొన్న కేసీఆర్‌ ఖమ్మంలో ఐటీ టవర్‌ వస్తుందని కలలో అయినా ఊహించామా అన్నారు. ఖమ్మం పక్కనే పాలేరు రిజర్వాయర్‌ ఉన్నా మంచినీటి ఇబ్బందులు ఉండేవన్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో ఖమ్మంలో 75వేల కుళాయి కనెక్షన్లు ఇచ్చామని చెప్పారు. 7వందల కోట్లు ఖర్చు చేసి ఖమ్మం పట్టణాన్ని అభివృద్ధి చేశామని వెల్లడించారు. అనంతరం తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి బీఆర్‌ఎస్‌పై చేస్తున్న విమర్శలను కేసీఆర్‌ తోసిపుచ్చారు. తెలంగాణలో ఎవరూ ఊహించని అభివృద్ధి జరిగిందన్న కేసీఆర్‌... ఇలాగే కొనసాగేందుకు బీఆర్‌ఎస్‌కు మరోసారి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.


ప్రాంతీయ పార్టీల యుగం రాబోతోందని కేసీఆర్‌ స్పష్టం చేశారు. ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉంటేనే.. ఆయా రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడవచ్చునని చెప్పారు. అవే ప్రజలను కడుపులో పెట్టుకుంటాయని, వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటాయని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యం పరిణతి చెందాలని.. ఎవరు గెలవాలని ప్రజలు కోరుకుంటారో వారు గెలిస్తేనే ప్రజల గెలుపు అవుతుందని కేసీఆర్‌ అన్నారు. అభ్యర్థుల గుణగణాలు చూడాలని.. అభ్యర్థి వెనుక ఉన్న పార్టీని గమనించాలని.. పార్టీ వైఖరి, దాని చరిత్ర, నడవడిక చూడాలని అన్నారు. ఆ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ప్రజల గురించి ఏం ఆలోచించిందన్నది గ్రహించాలని.. తెలంగాణ తెచ్చిన వ్యక్తిగా... సమాజం బాగుపడాలని మనస్పూర్తిగా కోరుకునే వ్యక్తిగా బాధ్యతతో ఈ మాటలు చెబుతున్నానని. ఆలోచించి విజ్ఞతతో ఓటేయాలని కేసీఆర్‌ అన్నారు. గోదావరిని గతంలో చూసి సంతోషపడటమే తప్ప.. గుక్కెడు నీళ్లు రాలేదని... ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టు పనులు 70 శాతం పూర్తయ్యాయని కేసీఆర్‌ గుర్తు చేశారు. మళ్లీ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే వస్తుందని, త్వరలోనే సీతారామ ప్రాజెక్టును ప్రారంభిస్తానన్నారు. వనమా వెంకటేశ్వరరావు సాధారణ కార్యకర్త నుంచి మంత్రి స్థాయికి ఎదిగారని, కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధే ఆయనకు ముఖ్యమని, మంచి వ్యక్తి గెలిస్తే కొత్తగూడెం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు.

Tags

Read MoreRead Less
Next Story