Top

అసెంబ్లీ సమావేశాల తర్వాత ఆ మూడింటికీ ఒకేసారి శంకుస్థాపన:కేసీఆర్

రాష్ట్రంలో ఉర్థూను రెండవ అధికార భాషగా గుర్తిస్తున్నామన్నారు కేసీఆర్

అసెంబ్లీ సమావేశాల తర్వాత ఆ మూడింటికీ ఒకేసారి శంకుస్థాపన:కేసీఆర్
X

కొత్తగా నిర్మించే సెక్రటేరియట్‌లో మందిరం, మసీదులు, చర్చ్‌ని పూర్తిగా ప్రభుత్వ ఖర్చుతో నిర్మిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత గంగా జమునా తహజీబ్‌కు అద్దం పట్టేలా ఒకే రోజు అన్ని ప్రార్థనా మందిరాలకు శంకుస్థాపన చేసి, త్వరితగతిన నిర్మాణం పూర్తి చేస్తామని వెల్లడించారు. సచివాలయంలో మసీదు నిర్మాణం, ఇతర అంశాలపై ముస్లిం మత పెద్దలతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్‌లో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారితో కూలంకషంగా చర్చించారు.

ఒక్కొక్కటి 750 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇమామ్ క్వార్టర్‌తో సహా 2 మసీదులు ప్రభుత్వం నిర్మిస్తుందని కేసీఆర్ చెప్పారు. పాత సెక్రటేరియట్‌లో ఉన్న స్థలంలోనే మసీదుల నిర్మాణం జరుగుతుందన్నారు. నిర్మాణం పూర్తయిన తర్వాత మసీదులను వక్ఫ్ బోర్డుకు అప్పగిస్తామన్నారు. అలాగే 1500 చదరపు అడుగుల విస్తీర్ణంలో మందిరం నిర్మాణాన్ని ప్రభుత్వం చేపడుతుందని దాన్ని దేవాదాయ శాఖకు అప్పగిస్తామన్నారు. కొత్త సెక్రటేరియట్ ప్రాంతంలో తమకు కూడా ప్రార్థనా మందిరం కావాలన్న క్రిస్టయన్ల కోరిక మేరకు చర్చ్‌ని కూడా ప్రభుత్వం నిర్మిస్తుందని చెప్పారు కేసీఆర్. తెలంగాణ రాష్ట్రం అన్ని మతాలను సమానంగా ఆదరిస్తుందన్నారు. పరమత సహనం పాటిస్తూనే.. గంగా జమునా తహజీబ్‌కు ప్రతీకగా ప్రార్థనా మందిరాలు నిర్మిస్తామన్నారు.

ముస్లిం అనాథ పిల్లలకు ఆశ్రయమిచ్చి, విద్య నేర్పించే అనీస్ – ఉల్ – గుర్భా నిర్మాణం వేగవంతం చేస్తామని ముస్లిం పెద్దలకు చెప్పారు కేసీఆర్. ఇప్పటికే 80 శాతం నిర్మాణం పూర్తయిందని, మరో 18 కోట్లు అవసరమవుతాయని అన్నారు. వాటిని వెంటనే విడుదల చేసి, నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేస్తామన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్ నగరంలో ఇస్లామిక్ సెంటర్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. హైదరాబాద్ చుట్టూ ఖబ్రస్థాన్‌లు రావాల్సిన అవసరం ఉందన్న KCR.. స్థలాలు సేకరించాలని ఇప్పటికే రంగారెడ్డి, మేడ్చల్ కలెక్టర్లను కోరామని వివరించారు.

రాష్ట్రంలో ఉర్థూను రెండవ అధికార భాషగా గుర్తిస్తున్నామన్నారు KCR. ఉర్ధూ భాష పరిరక్షణ, అభివృద్ధి కోసం కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు. అందుకోసం అధికార భాష సంఘంలో ఉర్థూ భాషాభివృద్ధి కార్యక్రమాలు చేపడతామన్నారు. KCRతో జరిగిన సమావేశంలో హోంమంత్రి మహమూద్ అలీ, MP అసదుద్దీన్ ఓవైసీ, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ మెంబర్లతోపాటు పలువురు పాల్గొన్నారు.

Next Story

RELATED STORIES