KCR: కాంగ్రెస్‌ విధానాలపై కేసీఆర్‌ మండిపాటు

KCR: కాంగ్రెస్‌ విధానాలపై కేసీఆర్‌ మండిపాటు
వంద రోజుల్లోనే 200మంది రైతుల ఆత్మహత్య... ఆవేదన వ్యక్తం చేసిన కేసీఆర్

ప్రపంచమే మెచ్చిన మిషన్‌ భగీరథ నిర్వహణలో లోపాలెందుకు వస్తున్నాయని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ప్రశ్నించారు. తమ హయాంలో బిందె పట్టుకుని ఏ ఆడబిడ్డ కూడా కనిపించలేదన్న ఆయన.. అసమర్థ పాలన వల్లే తెలంగాణలో ఈ పరిస్థితి దాపురించిందన్నారు. వాగ్దానాలు అమలు చేయకపోతే... కాంగ్రెస్‌ పాలకుల్ని నిద్రపోనివ్వబోమని హెచ్చరించారు. తెలంగాణలో ఎండిన పంట పొలాలను బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పరిశీలించారు. సాగునీరు లేక కర్షకులు ఎదుర్కొంటున్న కష్టాలను స్వయంగా చూశారు. జనగామ, సూర్యాపేట జిల్లాల్లో ఎండిన చేలలో రైతుల ఆవేదనను విన్నారు. అసమర్థ పాలన వల్లే రాష్ట్రంలో ఈ పరిస్థితి దాపురించిందన్నారు.


జనగామ జిల్లా దేవరుప్పుల మండలం ధరావత్ తండాలో ఎండిన పంట చేలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. రైతులు ధైర్యం కోల్పోవద్దని పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని KCR భరోసా ఇచ్చారు. ఓ మహిళా రైతు కుమార్తె పెళ్లికి 5 లక్షల రూపాయల సాయాన్ని ప్రకటించారు. అనంతరం సూర్యాపేట చేరుకున్న కేసీఆర్ తుంగతుర్తి నియోజకవర్గం వెలుగుపల్లి, ఎర్కారంలో ఎండిన పంట పొలాలు పరిశీలించి రైతులతో మాట్లాడారు. అనంతరం మీడియా సమావేశంలో KCR... కాంగ్రెస్‌ ప్రభుత్వపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రైతులంటే కాంగ్రెస్‌ ప్రభుత్వానికి అసలు పట్టింపేలేదన్న బీఆర్‌ఎస్‌ అధినేత సాగు, తాగు నీరు ఇవ్వడంలో ఘోరంగా విఫలమయ్యారని మండిపడ్డారు. తమ హయాంలో ఎలాంటి కోతలు లేకుండా విద్యుత్‌ సరఫరా చేశామన్న KCR...కాంగ్రెస్‌ ప్రభుత్వ 100 రోజుల పాలనలో విద్యుత్‌ రంగం అస్తవ్యస్తమైందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల పక్షాన ఏప్రిల్‌ 2 నుంచి భారాస ఆందోళనలకు దిగుతుందని కేసీఆర్‌ ప్రకటించారు. చిల్లర రాజకీయం కోసం కాళేశ్వరం నీళ్లు కిందకు వదిలేశారని ఎంతసేపూ విపక్షాన్ని బద్‌నాం చేయాలనే చిల్లర రాజకీయమే నడుస్తోందని ధ్వజమెత్తారు.

కాంగ్రెస్‌ హయాంలో పోలీసులు ప్రజలపట్ల, ప్రతిపక్ష పార్టీ శ్రేణులపట్ల దురుసుగా వ్యవహరిస్తున్నారని కేసీఆర్‌ మండిపడ్డారు. ఈ దురుసు ప్రవర్తనను తగ్గించుకోవాలని హెచ్చరించారు. ఇవాళ సూర్యాపేటలో నిర్వహించిన ప్రెస్‌ మీట్‌లో ఆయన పోలీసుల తీరును తప్పుపట్టారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, అధికార పార్టీ కోసం దురుసుగా ప్రవర్తించడం సబబు కాదని కేసీఆర్‌ హితవు పలికారు. ఉన్నోన్ని లేనోన్ని కడుపుల పెట్టుకుని కంటికిరెప్పలా చూసుకున్నం. అదే ప్రజలను ఇప్పుడు మీరు మోసం చేస్తమంటే ఊరుకోం. రెండు లక్షల రుణ మాఫీ ఏమైంది..? ఎందుకు స్పందిస్తలేరు. ఎప్పటికల్లా చేస్తరో ఎందుకు చెప్తలేరు..? బ్యాంకులు రైతులకు నోటీలిస్తున్నా ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎందుకు నోరు మెదపరు..? దానికి సమాధానం కావాలి. మేం ప్రజల పక్షాన, రైతాంగం పక్షాన అడుగుతున్నం’ అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story