Telangana: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డి

Telangana: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డి


తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డి నియమితులయ్యారు. పార్టీ సంస్థాగత ప్రక్షాళనలో భాగంగా బీజేపీ హైకమాండ్‌ కిషన్‌రెడ్డికి తెలంగాణ పార్టీ పగ్గాలను అప్పగించింది. కిషన్‌రెడ్డి నాయకత్వంలో ఎన్నికలకు వెళ్లాలని కమలదళం రెడీ అయింది. కిషన్‌రెడ్డిని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మరోసారి నియమించడం వెనుక బలమైన కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. సామాన్య కార్తకర్త స్థాయి నుంచి కేబినెట్‌ మంత్రిగా ఎదిగిన కిషన్‌రెడ్డికి పార్టీపై గట్టి పట్టుంది. ఇప్పటికే ఓ సారి పార్టీ రాష్ట్ర బాధ్యతలు చూసిన కిషన్‌రెడ్డి మరోసారి పార్టీ పగ్గాలు అందుకునేందుకు సిద్ధమయ్యారు.






1960లో రంగారెడ్డి జిల్లా తిమ్మాపురం గ్రామంలో జన్మించిన కిషన్ రెడ్డి.. సాధారణ కార్యకర్తగా బీజేపీలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. కిషన్ రెడ్డి విద్యార్థి దశ నుంచి రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడమే కాకుండా, అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. కృషి, దీక్ష, పట్టుదల, నేర్పరితనం, ఓర్పు, స్పష్టమైన వైఖరితో ఉన్న వ్యక్తిత్వమే కిషన్‌రెడ్డిని ఆ స్థాయికి తీసుకు వెళ్లింది. లోక్‌ నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ, అటల్ బిహారీ వాజ్‌పేయి ఆదర్శాలకు ఆకర్షితుడైన కిషన్‌ రెడ్డి విద్యార్థిగా ఉన్నప్పుడే అప్పటి జనతా పార్టీలో చేరారు.






2010లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2004 శాసనసభ ఎన్నికలలో తొలిసారిగా హిమాయత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజనలో అంబర్‌పేట్‌ నుంచి పోటీ చేశారు. 2009, 2014లో అక్కడి నుంచి వరుసగా రెండు సార్లు విజయం సాధించారు. తెలంగాణ ఉద్యమంలోనూ కిషన్‌రెడ్డి చురుకుగా పాల్గొన్నారు. తెలంగాణ సాధన కోసం 2012లో మహబూబ్‌నగర్ జిల్లా కృష్ణా గ్రామం నుంచి 22 రోజులపాటు తెలంగాణ ప్రాతంలో బీజేపీ పోరుయాత్ర నిర్వహించారు. 2018లో అంబర్‌పేట్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో కిషన్‌రెడ్డి ఓటమిని చవిచూశారు. మరుసటి ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కిషన్‌రెడ్డి... టీఆర్‌ఎస్‌ అభ్యర్థిపై భారీ మెజార్టీతో విజయం సాధించారు.





తొలి సారి ఎంపీగా గెలిచిన కిషన్‌రెడ్డికి బీజేపీ హైకమాండ్‌ ప్రాధాన్యం ఇచ్చింది. మొదటి నుంచి పార్టీకి విధేయుడిగా ఉన్న కిషన్‌రెడ్డిని కేంద్ర కేబినెట్‌లోకి తీసుకున్నారు ప్రధాని మోదీ. హోంశాఖ సహాయమంత్రి బాధ్యతలను అప్పగించారు. ఆ తర్వాత జరిగిన మంత్రి వర్గ విస్తరణలో కిషన్‌రెడ్డికి ప్రమోషన్‌ లభించింది. తెలంగాణ బీజేపీ నుంచి కేబినెట్‌ మంత్రి పదవి లభించడం అదే తొలిసారి. సహాయ మంత్రిగా చురుకైన పాత్ర నిర్వహించిన కిషన్‌రెడ్డి పనితీరును మెచ్చిన ప్రధాని మోదీ మరింత ఉన్నత హోదా కల్పించారు. ప్రస్తుతం కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డికి తెలంగాణ పార్టీ బాధ్యతలను అప్పగించారు. కిషన్‌రెడ్డి నియామంకపై పార్టీలో హర్షం వ్యక్తమవుతోంది. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లకు ధీటుగా బీజేపీ బరిలో నిలవాలంటే కిషన్‌రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగించడమే కరెక్ట్ అని నేతలు అంటున్నారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొనే కిషన్‌రెడ్డిని మరోసారి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించినట్లు తెలుస్తోంది.





Tags

Read MoreRead Less
Next Story