Kishan Reddy: నేడు నామినేషన్‌ వేయనున్న కిషన్‌రెడ్డి

Kishan Reddy: నేడు నామినేషన్‌ వేయనున్న కిషన్‌రెడ్డి
పని చేశాననుకుంటే మళ్లీ గెలిపించండి,‘ప్రజలకు నివేదిక’ సభలో కిషన్‌రెడ్డి

సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థిగా కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి శుక్రవారం ఉదయం నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. జీహెచ్‌ఎంసీ సికింద్రాబాద్‌ జోనల్‌ కార్యాలయంలో ఆయన తన నామినేషన్‌ పత్రాలు సమర్పించనున్నారు. ఈ కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ హాజరుకానున్నారు. ముందుగా ఆయన సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో పూజలు చేస్తారు. అనంతరం ఆలయం నుంచి పాదయాత్రగా వెళ్లి 11 గంటల సమయంలో మెహబూబ్‌ కాలేజీ వద్ద వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో కిషన్‌రెడ్డి, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్‌ ప్రసంగిస్తారు.

సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ అభివృద్ధికి తాను పనిచేశానని అనుకుంటేనే ఓటు వేయాలని సికింద్రాబాద్‌ భాజపా అభ్యర్థి కిషన్‌రెడ్డి అన్నారు. కేంద్రమంత్రిగా తాను చేసిన అభివృద్ధిపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చిన ఆయన కేంద్రం పదేళ్లలో తెలంగాణకు 10 లక్షల కోట్ల రూపాయలు కేటాయించిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్‌నారాయణ సహా తదితరులు పాల్గొన్నారు.

సికింద్రాబాద్‌ లోయర్ ట్యాంక్‌బండ్‌లోని పింగిళి వెంకట్రామ్‌రెడ్డి హాల్‌లో భాజపా పదేళ్ల ప్రగతి నివేదికను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ లేకపోతే తాను లేనని అన్నారు. తనపై ఇప్పటి వరకు ఒక్క అవినీతి మచ్చ లేదన్న కిషన్‌రెడ్డి.... తనపై కొందరు చెప్పలేని భాషలో విమర్శలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వారికి ప్రజలు గతంలో బుద్ది చెప్పారని... రాబోయే రోజుల్లోనూ బుద్ది చెబుతారని అన్నారు. నియోజకవర్గంలో తాను పనిచేశానని అనుకుంటేనే ఓటు వేయాలన్న కిషన్‌రెడ్డి... గెలిపిస్తే మళ్లీ ప్రజలకు సేవ చేస్తానని పేర్కొన్నారు

ఈ కార్యక్రమానికి లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్‌ నారాయణ హాజరయ్యారు. కిషన్‌రెడ్డి మిత్రుడిగా మాత్రమే కాకుండా ఒక ఓటరుగా ఈ కార్యక్రమానికి వచ్చినట్లు తెలిపారు. దేశాభివృద్ది కోసం జరుగుతున్న ఎన్నికల్లో ప్రజలు... భవిష్యత్‌ కోసం ఓటు వేయాలని జయప్రకాష్ నారాయణ సూచించారు. రాష్ట్రాల హక్కుల కోసం పోరాడాలి కానీ... అందుకోసం దేశాన్ని విచ్చిన్నం చేయకూడదన్నారు

Tags

Read MoreRead Less
Next Story