KTR Counter: కాంగ్రెస్ పార్టీది ఫ్రస్టేషన్‌ సభ - కేటీఆర్

KTR Counter: కాంగ్రెస్ పార్టీది ఫ్రస్టేషన్‌ సభ - కేటీఆర్
కర్నాటకలో కనీసం రేషన్ ఇవ్వలేరు.. తెలంగాణ వచ్చి డిక్లరేషన్ ఇస్తే నమ్మేదెవరు? - కేటీఆర్

చేవేళ్లలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది డిక్లరేషన్ సభ కాదు.. ఫ్రస్టేషన్‌ సభ అన్నారు మంత్రి కేటీఆర్. అధికారం రానే రాదనే ఫ్రస్టేషన్‌లో కాంగ్రెస్ పార్టీ ఆ సభ నిర్వహించిందంటూ ఎద్దేవా చేశారు. కర్నాటకలో కనీసం రేషన్ ఇవ్వలేని కాంగ్రెస్.. తెలంగాణ వచ్చి డిక్లరేషన్ ఇస్తే నమ్మేదెవరు అంటూ ట్వీట్ చేశారు. గాడ్సేనే గెలుస్తాడన్న గ్యారెంటీ లేదు.. మీ 12 గ్యారెంటీలకు విలువ ఎక్కడిదని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ పేరిట విజన్‌లేని కాంగ్రెస్ ఇచ్చిన డజన్ హామీలు గాలిలో దీపాలేనని చైతన్యానికి ప్రతీకైన తెలంగాణ ప్రజలకు తెలుసన్నారు.

స్వాతంత్రం వచ్చిన 75ఏళ్ల తర్వాత కూడా ఎస్సీలు, ఎస్టీలు వెనకబడి ఉన్నారంటే దానికి కారణం ప్రధాన దోషి కాంగ్రెస్ పార్టీయేనన్నారు. దళిత, గిరిన బిడ్డలకు కాంగ్రెస్ చేసిన దశాబ్దాల పాపం.. ఆ పార్టీని మరో వందేళ్లయినా శాపంలా వెంటాడుతూనే ఉంటుందని హెచ్చరించారు. కర్నాటకలో నమ్మి ఓటేసిన ప్రజలను నట్టేట ముంచిన కాంగ్రెస్ పార్టీకి పాలించే ఎబిలిటీ లేదు.. ప్రజల్లో క్రెడిబిలిటి లేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం అంటేనే దేశానికే ఓ పరిపాలనా పాఠం అన్న కేటీఆర్.. ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చని పార్టీ కాంగ్రెస్ అయితే.. ఇవ్వని హామీలెన్నో అమలు చేసిన ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీది అంటూ ట్వీట్ చేశారు. తెలంగాణలో బీజేపీకి చరిత్రలేదు, కాంగ్రెస్‌కు భవిష్యత్తు లేదన్నారు. చరిత్ర, భవిష్యత్తు ఉన్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనన్నారు మంత్రి కేటీఆర్.

Tags

Read MoreRead Less
Next Story