KTR: లాస్య నందిత కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్‌

KTR: లాస్య నందిత కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్‌
కుటుంబ సభ్యులను ఓదార్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్

దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. లాస్య నందిత చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ప్రమాదంకు గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి ధైర్యం చెప్పారు. కుటుంబానికి అన్నివిధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో చనిపోయిన విషయం తెలుసుకొని విస్మయానికి గురైనట్లు కేటీఆర్ చెప్పారు. నేను విదేశాల్లో ఉండటం వల్ల రాలేక పోయానని అన్నారు. లాస్య నందితను గత పదిరోజులుగా అనేక ప్రమాదాల వెంటాడాయని, గతేడాది సాయన్న చనిపోవటం, ఇప్పుడు లాస్య నందిత మృతితో కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ శ్రేణుల్లో తీరనిశోకాన్ని నింపిందన్నారు. ఆమె కుటుంబానికి అన్నివిధాల అండగా ఉంటామని, వారి కుటుంబానికి ధైర్యం ఇవ్వాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నట్లు కేటీఆర్ చెప్పారు.

కంటోన్మెంట్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే లాస్య నందిత శుక్రవారం తెల్లవారుజామన జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిందే. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు వద్ద ఔటర్‌ రింగ్‌రోడ్డుపై ఆమె ప్రయాణిస్తున్న కారు ఓ గుర్తుతెలియని భారీ వాహనాన్ని వెనుక నుంచి ఢికొన్ని.. అదుపుతప్పి రోడ్డు పక్కనున్న రెయిలింగ్‌ను గుద్దుకోవడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో కారు ముందు సీట్లో కూర్చున్న నందిత తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందారు.

కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి కేసు దర్యాప్తులో భాగంగా.. శనివారం పటాన్‌చెరు డీఎస్పీ రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు సికింద్రాబాద్‌లోని ఆమె నివాసానికి వెళ్లి.. తల్లి, అక్కతోపాటు ఆమె కూతరు నుంచి స్టేట్‌మెంట్లు తీసుకున్నారు. మియాపూర్‌లోని దవాఖానలో చికిత్స పొందుతున్న డ్రైవర్‌ కమ్‌ పీఏ ఆకాశ్‌ కూడా లాస్య నందిత కుటుంబసభ్యులు చెప్పినట్టుగానే స్టేట్‌మెంట్‌ ఇచ్చాడని సమాచారం. అయితే దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత కుటుంబ సభ్యులు మాత్రం లాస్య మృతికి ఆమె పీఏ, డ్రైవర్ ఆకాశ్ కారణమని అంటున్నారు. ఇప్పటికే ఆకాశ్‌పై పోలీసులకు లాస్య సోదరి నివేదిత ఫిర్యాదు చేశారు. ఆకాశ్‌పై కేసు నమోదు చేసిన పటాన్ చెరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story