KTR: జాతీయ పట్టణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టండి: కేటీఆర్

KTR: జాతీయ పట్టణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టండి: కేటీఆర్
KTR: దేశంలోని పట్టణ ప్రాంత పేద ప్రజల కోసం ప్రత్యేక ఉపాధి హామీ కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టాలని మంత్రి కేటీఆర్‌ అన్నారు.

KTR: దేశంలోని పట్టణ ప్రాంత పేద ప్రజల కోసం ప్రత్యేక ఉపాధి హామీ కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టాలని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఈ విషయాన్ని రానున్న బడ్జెట్ సమావేశాల్లో పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వాన్నిఆయన కోరారు. ఈ మేరకు పట్టణ ప్రాంతాల్లోని పేద ప్రజల జీవన స్థితిగతులు, వాటిలో సానుకూల మార్పుకు చేపట్టాల్సిన కార్యక్రమాల పై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌కు కేటీఆర్‌ లేఖ రాశారు.

పట్టణీకరణ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిణామం అని.. ఇందుకు భారతదేశం మినహాయింపు కాదని మంత్రి కేటీఆర్ తెలిపారు. మెరుగైన ఉపాధి జీవన అవకాశాల కోసం గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు పట్టణాలవైపు తరలి వస్తున్న నేపథ్యంలో పట్టణాల్లోని మౌలిక వసతులపైన తీవ్రమైన ఒత్తిడి నెలకొంటుందని కేటీఆర్‌ పేర్కొన్నారు. ఇది రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు.

2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలోని 31 శాతం జనాభా పట్టణాల్లో నివాసం ఉంటుందని.. 2030 నాటికి దేశంలోని 40 శాతానికి పైగా జనాభా పట్టణ ప్రాంతాల్లో నివాసం ఉండబోతుందన్నారు. తెలంగాణ లాంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఇది 50 శాతాన్ని దాటే అవకాశం ఉందని కేటీఆర్ పేర్కొన్నారు.పెద్ద ఎత్తున పట్టణాల్లోకి ప్రజలు తరలి వస్తున్న నేపథ్యంలో పట్టణ పేదరికంపైన ప్రభుత్వాలు దృష్టి సారించాలని కేటీఆర్‌ పేర్కొన్నారు.

పట్టణ పేదలకు అవసరమైన హౌసింగ్, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, ఆరోగ్యం, విద్య, సామాజిక భద్రత, జీవనోపాదుల వంటి అంశాలపైన ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టాలన్నారు. ఇక పట్టణాల్లో ఉన్న పేదలకు భరోసా ఇచ్చే విధంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మాదిరే ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని పట్టణాల్లోని పేదల కోసం చేపట్టాలని మంత్రి కేటీఆర్ కేంద్రానికి సూచించారు.

ప్రస్తుతం ఉన్న కరోనా సంక్షోభం వలన పట్టణ ప్రాంతాల్లో భారీ ఎత్తున నిరుద్యోగం, పేదరికం పెరిగిపోయిందన్నారు. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ లెక్కల ప్రకారం 2019 అక్టోబర్ నుంచి 2021 మార్చ్ మధ్యలో గరిష్టంగా 21 శాతం నిరుద్యోగం నెలకొని ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పట్టణాల్లోని పేదలకు అండగా ఉండడం కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం అత్యవసరమన్నారు.

Tags

Read MoreRead Less
Next Story