కరీంనగర్ జిల్లాలో గ్రామ సర్పంచ్‌ని సస్పెండ్‌ చేయడంపై ఆందోళనలు

కరీంనగర్ జిల్లాలో గ్రామ సర్పంచ్‌ని సస్పెండ్‌ చేయడంపై ఆందోళనలు

కరీంనగర్ జిల్లా గంగాధర మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామ సర్పంచ్ విజయలక్ష్మిని సస్పెండ్‌ చేయడంపై ఆందోళనలు మిన్నంటుతున్నాయి. చొప్పదండి ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్‌ కక్షపూరితంగా తనను సస్పెండ్‌ చేశారని ఆమె ఆరోపించారు. ఆమెకు మద్దతుగా గ్రామానికి చెందిన దళితులు నిరసన బాట పట్టారు. తమ గ్రామ సర్పంచిని ఎలాంటి కారణం లేకుండానే సస్పెండ్ చేసారని ఆరోపించారు. అదే గ్రామానికి చెందిన రెండు వందల మంది మహిళలు తమ సర్పంచ్ కి న్యాయం చేయాలని, సస్పెన్షన్‌ని వెంటనే ఎత్తి వేయాలని కలెక్టరేట్ కార్యాలయం ముందు కలెక్టర్ కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బైఠాయించారు. సుమారు గంటపాటు ఎమ్మెల్యేకు, కలెక్టర్‌కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

తాను ఒక దళిత మహిళ సర్పంచ్ అయినందునే తనని సస్పెండ్ చేసారని విజయలక్ష్మి ఆరోపించారు. తన సస్పెన్షన్‌కి చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ కారణమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాను చెప్పినట్లు వినడం లేదని కక్షతో ఎమ్మెల్యే తనని సస్పెండ్ చేయించారని ఆమె కన్నీరు పెట్టుకున్నారు. సరైన సమయంలో వైకుంఠధామం నిర్మించలేదని సాకు చూపించి ఉత్తర్వులు జారీ చేయడం దారుణమన్నారు.

వైకుంఠాధామ నిర్మాణానికి జాగా లేకపోయిన దాతల సహకారంతో స్థలాన్ని కొనుగోలు చేశారని దళితులు గుర్తు చేశారు. అయితే గ్రామ పెద్దమనుషులతో మాట్లాడిన ఎమ్మెల్యే నిర్మాణం చేయకుండా అడ్డుకున్నారని, దీనిపై పలుమార్లు అధికారులకి, కలెక్టర్‌కి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వారు ఆరోపించారు. ఎలాంటి కారణం లేకుండా ఒక దళిత మహిళా సర్పంచ్‌ను సస్పెండ్‌ చేయించిన వారిపై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలని వారు డిమాండ్‌ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story