కాజపల్లి అర్భన్ ఫారెస్ట్ పార్క్‌కు శంకుస్థాపన

దుండిగల్ సమీపంలో కాజపల్లి అర్భన్ ఫారెస్ట్ పార్క్‌కు శంకుస్థాపన చేశారు అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్. 1650 ఎకరాల ఫారెస్ట్ బ్లాక్‌ను యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ దత్తత తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, హీరో ప్రభాస్‌లు రావి, జువ్వి, కుసుమ మొక్కలు నాటారు.
ఎంపీ సంతోష్ కుమార్ చొరవతో బాహుబలి డేరింగ్ స్టెప్ వేసి దత్తతకు ముందుకు వచ్చారు. తండ్రి దివంగత యు.వి.ఎస్. రాజు పేరు మీద అర్భన్ పార్కును, అటవీ ప్రాంతాన్ని ప్రభాస్ అభివృద్ధి చేయనున్నారు. ఇందుకోసం ప్రభాస్ రెండు కోట్ల రూపాయలను అందించారు. అవసరాన్ని బట్టి మరింత ఖర్చు చేసేందుకు ఆయన సుముఖత వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రభాస్... వ్యూ పాయింట్ నుంచి అటవీ అందాలను తిలకించారు.
మరోవైపు ఔటర్ రింగ్ రోడ్డు వెంట మరో అర్భన్ ఫారెస్ట్ పార్కు అందుబాటులోకి రానుంది. త్వరలో మరిన్ని అర్భన్ ఫారెస్ట్ బ్లాక్‌ల దత్తతకు ప్రయత్నిస్తామని ఎంపీ సంతోష్ కుమార్ తెలిపారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పీసీసీఎఫ్ శోభ, ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com