Free Bus Scheme: ఉచిత ప్రయాణానికి అద్భుత స్పందన..

Free Bus Scheme: ఉచిత ప్రయాణానికి అద్భుత స్పందన..
పురుషులకోసం ప్రత్యేక ఏర్పాట్లకు ప్రణాళిక

మహాలక్ష్మీ పథకం ప్రభావంతో RTC బస్సులు కిటకిటలాడుతున్నాయి. ఉచిత బస్సు ప్రయాణంతో కొన్ని డిపోలు 100శాతం ఆక్యుపెన్సీ రేషియో దాటిపోయాయి. ఆర్టీసీ బస్సుల్లో సుమారు 70శాతం వరకు మహిళలే ప్రయాణిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. బస్సులో డబ్బులు పెట్టి టిక్కెట్‌ కొంటున్న పురుషులు... సీట్లు లేక ఇబ్బంది పడుతున్నారు. తమ సమస్య పరిష్కారించాలని ఆర్టీసీ యాజమాన్యానికి ఫిర్యాదు చేస్తున్నారు. పురుష ప్రయాణికులు ఆర్టీసీ దూరం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేసేందుకు RTC ఓ కమిటీని వేసింది.

రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రజా రవాణా వ్యవస్థ ఆర్టీసీ. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీకి 9వేలకుపైగా బస్సులు ఉన్నాయి. సంస్థలో 50వేలకుపైగా ఉద్యోగులు ఉన్నారు. ఆర్టీసీ బస్సులు సుమారు 10వేల గ్రామాల్లో 35 లక్షల కిలోమీటర్ల వరకు నిత్యం ప్రయాణిస్తుంటాయి. దాదాపు 45 లక్షల మందిని ప్రతిరోజూ వారి గమ్యస్థానాలకు చేర్చుతున్నాయి. ఇటీవల ప్రభుత్వం మహాలక్ష్మి పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెట్టింది. ఈ పథకానికి మహిళా ప్రయాణికుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. ఏ బస్సులు చూసినా మహిళలతో కిటకిటలాడుతున్నాయి.


మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చిన 11 రోజుల్లోనే రికార్డుస్థాయిలో 3 కోట్ల మంది మహిళలు TSRTC బస్సుల్లో ప్రయాణించారు. ప్రతి రోజూ సగటున 30 లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారు. మొత్తంగా రోజూ 51 లక్షల మంది ప్రయాణికులను ఆర్టీసీ గమ్యస్థానాలకు చేర్చుతోంది. పథకం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారిలో 62 శాతం మంది మహిళలే ఉన్నారని యాజమాన్యం వెల్లడించింది. మహిళలకు ఉచిత ప్రయాణం కారణంగా సంస్థ ఆక్యూపెన్సీ రేషియో గణనీయంగా పెరిగింది. గతంలో 69 శాతం O.R ఉండగా.. ప్రస్తుతం అది 88 శాతానికి పెరిగింది. మూడు రోజుల్లో యాదగిరిగుట్ట, వేములవాడ, దుబ్బాక, గజ్వేల్, హుజురాబాద్, మేడ్చల్, ముషీరాబాద్, మియాపూర్-2, జీడిమెట్ల, కుషాయిగూడ డిపోలు 100 శాతం O.R సాధించాయని సంస్థ వెల్లడించింది.

పురుష ప్రయాణికులు సంస్థకు దూరం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవచ్చనే అంశంపై ఆర్టీసీ యాజమాన్యం ఉన్నతాధికారులతో కమిటీ చేసింది. ఆ కమిటీ ఏ సమయాల్లో ఎక్కువ మంది ప్రయాణిస్తున్నారు...? ఏయే రూట్లలో ఎక్కువ మంది ప్రయాణిస్తున్నారు..? ఆయా రూట్లలో మహిళలకు ప్రత్యేక బస్సులు కేటాయిస్తే ఎలా ఉంటుంది..? వృద్దులు, వికలాంగులకు ఏవిధంగా సీట్ల కేటాయింపు చేయాలి...? తదితర అంశాలపై అధ్యయనం చేస్తోంది. కొత్త బస్సులను సమకూర్చుకోవడంపైనా ఆర్టీసీ దృష్టి సారించింది. ఇప్పటికే 350 అద్దె బస్సులకు నోటిఫికేషన్ ఇచ్చింది. అవి త్వరలోనే వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొత్త బస్సులు అందుబాటులోకి వస్తే... సమస్య పరిష్కారం అవుతుందని అంచనా వేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story