Congress: నేడే తుక్కుగూడ వేదికగా జనజాతర

Congress: నేడే  తుక్కుగూడ వేదికగా జనజాతర
కాంగ్రెస్‌ అగ్రనేతలంతా హాజరు

కేంద్రంలో అధికారంపగ్గాలు చేపట్టాలని ఉవ్విళ్లూరుతున్న కాంగ్రెస్‌.. తెలంగాణ నుంచి లోక్‌సభ ఎన్నికల సమరశంఖాన్ని పూరించనుంది. గతంలో ‘విజయభేరి’పేరిట తుక్కుగూడలో సభ వేదికగా ఆరు గ్యారంటీ హామీలు ప్రకటనతో పార్టీకి సానుకూలత ఏర్పడిందనే సెంటిమెంటుతో.. లోక్‌సభ ఎన్నికలకు అదే వేదిక నుంచి ప్రచారానికి శ్రీకారం చుడుతోంది. కేంద్రంలో ప్రకటించిన మ్యానిఫెస్టో తెలుగుప్రతిని రాహుల్‌గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి విడుదల చేయనున్నారు. జనజాతర సభకు 10 లక్షల మంది వస్తారని భావిస్తున్న పార్టీ అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసింది.

ఢిల్లీ గద్దెపై జెండాని ఎగురవేయాలనే లక్ష్యంతో రంగారెడ్డిజిల్లా తుక్కుగూడ సభ వేదికగా.... కాంగ్రెస్‌ ఎన్నికల సమరశంఖాన్ని పూరించనుంది. జాతీయ ఎన్నికల ప్రచారానికి తొలిమెట్టుగా ‘జనజాతర’ పేరిట భారీ బహిరంగసభ నిర్వహించేందుకు పార్టీ సర్వం సిద్ధం చేసింది. సభా ప్రాంగణంలో మొత్తం మూడు స్టేజీలు ఏర్పాటు చేయగా..ప్రధాన స్టేజి మీద 300 మంది కూర్చునేందుకు... అవసరమైన ఏర్పాట్లు చేశారు. లక్ష మంది మహిళలు కూర్చునేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ప్రజలకి అసౌకర్యం కలగకుండా... LED స్క్రీన్లు అమర్చుతున్నారు. శుక్రవారం పార్టీజాతీయ మ్యానిఫెస్టోను దిల్లీలో సోనియా, ఖర్గే, రాహుల్‌ విడుదల చేశారు. అందుకు సంబంధించిన తెలుగుప్రతిని నేడు జరిగే జనజాతర సభలో రాహుల్‌గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి విడుదల చేయనున్నారు. ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో నెగ్గి కేంద్రంలో అధికారంలోకి రావడానికి తెలంగాణ, కర్ణాటక అత్యంతముఖ్యమని కాంగ్రెస్‌ భావిస్తోంది. పార్టీ అధిక లోక్‌సభ స్థానాలు నెగ్గే రాష్ట్రాల్లో ఆ రెండురాష్ట్రాలు ముందుంటాయని నేతలు అంచనా వేస్తున్నారు. తెలంగాణలో మొత్తం 17లో 14 లోక్‌సభ స్థానాలు గెలుచుకోవాలని పార్టీ లక్ష్యంగా పెట్టుకున్నందునే.. జాతీయ ఎన్నికల ప్రచార సమరశంఖాన్ని... హైదరాబాద్‌ నుంచే పూరించాలని నిర్ణయించింది. రాహుల్‌గాంధీ సభతో ప్రచారాన్ని ప్రారంభిస్తే రాష్ట్రంలో పార్టీశ్రేణుల్లో ఉత్సాహంవస్తుందని నాయకుల అంచనా. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలకు ముందు ‘విజయభేరి’ పేరిట తుక్కుగూడలో సభ వేదికగా ఆరు గ్యారంటీ హామీలు ప్రకటనతో పార్టీకి సానుకూలత ఏర్పడిందనే సెంటిమెంటుతో లోక్‌సభ ఎన్నికలకు అదే వేదికను ఎంచుకున్నారు.

జనజాతర సభ ఏర్పాట్లను పీసీసీ అధ్యక్షుడు, సీఎంరేవంత్‌రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.ఇప్పటికే మూడుసార్లు సభాస్థలికి వెళ్లి అధికారులు, నేతలకు పలు సూచనలిచ్చారు. శుక్రవారం కూడా పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జి దీపా దాస్‌మున్షీ, మంత్రులు శ్రీధర్‌బాబు, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్‌, ఇతర ముఖ్యనేతలు తుక్కుగూడలో ఏర్పాట్లను సమీక్షించారు. అగ్రనేతలు వస్తుండటంతో పాటు, తెలంగాణ వేదికగా జాతీయ ప్రచారానికి సమరశంఖాన్ని పూరించాలని కాంగ్రెస్‌ అధిష్ఠానం నిర్ణయించినందున సభను విజయవంతం చేయాలని నేతలు వివరించారు. కాంగ్రెస్‌ విడుదల చేసిన జాతీయ మ్యానిఫెస్టోలో నిరుద్యోగులు, రైతులు, మహిళలు సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిచ్చినందున ఆ సభకు వారిని ఎక్కువగా తరలించాలని నిర్ణయించారు. కేంద్రంలో అధికారంలోకి వస్తే ఏం చేస్తామో ప్రజలకు స్పష్టంగా వివరించిననున్నట్లు మంత్రులు తెలిపారు.


Tags

Read MoreRead Less
Next Story