Top

గణపతి లొంగుబాటుపై మావోయిస్టు పార్టీ స్పందన

మావోయిస్టు అగ్రనేత గణపతి లొంగిపోతున్నారంటూ గత కొన్ని రోజులుగా విస్తృతంగా ప్రచారం జరిగింది..

గణపతి లొంగుబాటుపై మావోయిస్టు పార్టీ స్పందన
X

మావోయిస్టు అగ్రనేత గణపతి లొంగిపోతున్నారంటూ గత కొన్ని రోజులుగా విస్తృతంగా ప్రచారం జరిగింది. ఇదే సమయంలో తెలంగాణ డీజీపీ మావోయిస్టు ప్రభావిత జిల్లాల్లో పర్యటించడం మరింత ప్రాధాన్యం పెంచింది. గణపతి అనారోగ్యంతో బాధపడుతున్నారని.. అందుకే లొంగిపోయేందుకు సిద్ధమయ్యారన్న వార్తలు వచ్చాయి. ఆయన కుటుంబ సభ్యులు డీజీపీని కలుస్తారన్న ప్రచారమూ జరిగింది. అయితే ఈ వార్తలపై మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ఎట్టకేలకు స్పందించింది. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. గణపతి లొంగుబాటుపై వస్తున్న వార్తలను ఖండించింది. ఇది ఒక చౌకబారు ఎత్తుగడగా అభివర్ణించింది..గణపతి సరెండర్ ఒక హైటెన్షన్ కల్పిత కథ అని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుతున్న నాటకమని కొట్టిపారేసింది. ఇదంతా కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ ఇంటెలిజెన్స్ అధికారులు ఆడిన నాటకమని, మీడియాను ఇందులో పావులుగా వాడుకున్నారని లేఖలో కమిటీ స్పష్టం చేసింది. కామ్రేడ్ గణపతి చిన్న చిన్న అనారోగ్య కారణాల రీత్యా స్వచ్ఛందంగా బాధ్యతల నుంచి మాత్రమే తప్పుకున్నారని లేఖ ద్వారా వివరించింది. ఆయన ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్నాడని పేర్కొంది.

సిద్ధాంత పరంగా, రాజకీయంగా తాము దృఢంగా ఉన్నామని... తమ నాయకత్వపు ప్రతిష్ఠను దెబ్బ తీసేందుకే ఇలాంటి కట్టుకథలు అల్లుతున్నారంటూ... కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్‌ పేరుతో ఓ లేఖను విడుదల చేశారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతామని లేఖలో పేర్కొన్నారు. అటుృ గణపతికి విదేశాల్లో చికిత్స జ‌రుగుతుందన్న మాటల్లోనూ నిజం లేద‌ని స్పష్టం చేశారు.మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో డీజీపీ పర్యటన.. గణపతి లొంగుబాటు వార్తల నేపథ్యంలో.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఓ ఎన్‌కౌంటర్‌ కలకలం రేపింది. గుండాల మండలం దేవలగూడెం అటవీప్రాంతంలో పోలీసులకు..మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక మావోయిస్టు మృతి చెందాడు.

గత రెండు మూడు రోజులుగా దేవలగూడెం, దుబ్బగూడెం అటవీ ప్రాంతంలో మావోయిస్టు దళం యాక్షన్ టీంలు సంచరిస్తున్నాయనే సమాచారంతో.. గుండాల పోలీసులు, స్పెషల్‌ పార్టీ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. గుండాల సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో.. పోలీసులను చూసి... బైక్‌పై వస్తున్న ఇద్దరు వ్యక్తులు పారిపోయేందుకు ప్రయత్నించారు. లొంగిపొమ్మని హెచ్చరించగా.. వారు కాల్పులకు దిగినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ తెలిపారు. అప్రమత్తమైన పోలీసులు వారిపై తిరిగి కాల్పులు జరిపినట్లు.. ఈ కాల్పుల్లో 25 ఏళ్లు గుర్తుతెలియని మావోయిస్టు మృతి చెందినట్లు చెప్పారు. మావోయిస్టు ప్రభావిత జిల్లాల్లో తెలంగాణ డీజీపీ పర్యటన కొనసాగుతుండటంతో..కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

Next Story

RELATED STORIES