మెదక్ అడిషనల్‌ కలెక్టర్ నగేష్ వ్యవహారంలో కొత్త అంశం

మెదక్ అడిషనల్‌ కలెక్టర్ నగేష్ వ్యవహారంలో కొత్త అంశం
కోటి 12 లక్షలు లంచం డిమాండ్ చేసి ఏసీబీకి అడ్డంగా దొరికిపోయిన మెదక్ అడిషనల్‌ కలెక్టర్ నగేష్ వ్యవహారంలో రోజుకో కొత్త అంశం వెలుగుచూస్తోంది. పట్టుబడిన రోజు..

కోటి 12 లక్షలు లంచం డిమాండ్ చేసి ఏసీబీకి అడ్డంగా దొరికిపోయిన మెదక్ అడిషనల్‌ కలెక్టర్ నగేష్ వ్యవహారంలో రోజుకో కొత్త అంశం వెలుగుచూస్తోంది. పట్టుబడిన రోజు నగేష్‌తోపాటు RDO అరుణారెడ్డి, తహసీల్దార్‌ సత్తార్ మాత్రమే కనిపించారు. అయితే అడిషనల్‌ కలెక్టర్‌ నగేష్‌కు సన్నిహితంగా ఉండి వ్యవహారాలు చక్కబెట్టిన మరో ముగ్గురు ఉద్యోగులు ఆరోజు నుంచి కనిపించడంలేదు. ఇళ్లకు తాళాలు వేసి ఉన్నట్టు తెలుస్తోంది. వీరు విధులకు ఎందుకు రావడం లేదన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏసీబీ రెయిడ్స్‌ జరుగుతున్న రోజు సైతం ఓ ఉద్యోగి డబ్బుల బ్యాగుతో నగేష్‌ ఇంటికి చేరుకున్నాడు. రెయిడ్స్ జరుగుతున్న విషయం తెలుసుకుని అటు నుంచి అటే పరారయ్యాడు. లేదంటే... ఆ రోజు మరో ఉద్యోగితోపాటు నగేష్ డబ్బులు డిమాండ్ చేసిన మరో అవినీతి ఎపిసోడ్‌ వెలుగులోకి వచ్చేది.

అడిషనల్ కలెక్టర్‌ చాలా పకడ్బందీగా మండల కార్యాలయాల్లో తన నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకున్నారు. ఏ వివాదాస్పద విషయమైనా తనకు తెలిసేలా.. తానే పరిష్కరించేలా చూసుకున్నారు. నగేష్ వ్యవహారాల్లో రిటైర్డ్ కలెక్టర్ ధర్మారెడ్డి పాత్ర ఉన్నట్టు తెలుస్తోంది. చిప్పల్‌తుర్తికి చెందిన 112 ఎకరాల NOC ఫైల్‌ కేవలం 10 రోజుల్లో పూర్తి కావడమే దీనికి కారణం. పైగా సర్వే నంబర్లు నిషేధిత జాబితా నుంచి తొలగించాలంటూ రిటైర్మెంట్‌ రోజే కలెక్టర్ ధర్మారెడ్డి స్టాంప్స్‌ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు లేఖ రాశారు. NOC ఫైల్‌ తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన రోజే నర్సాపూర్ తహసీల్దార్‌గా ఉన్న మాలతి 11 రోజుల సెలవుపై వెళ్లారు. ఇన్‌ఛార్జి తహసీల్దార్‌గా ఉన్న సత్తార్‌... ఆ ఫైల్‌ను క్లియర్ చేసిన RDO కార్యాలయానికి పంపారు. ఈ మొత్తం వ్యవహారంలో... అడిషనల్ కలెక్టర్‌ నగేష్‌... క్లర్క్ స్థాయి నుంచి కలెక్టర్‌ స్థాయి వరకు తన నెట్‌వర్క్‌ను ఎంత కట్టుదిట్టంగా సెట్‌ చేసుకున్నారో అర్థమవుతుంది.

అడిషనల్‌ కలెక్టర్‌ తీరుతో మెదక్ జిల్లా కలెక్టరేట్‌ ఉద్యోగులతోపాటు మండలాల్లో ఉన్న ఉద్యోగుల్లోనూ ఆందోళన మొదలైంది. నగేష్‌ కేసులో బినామీల డొంక కూడా కదులుతోంది. ఇప్పటికే బీనామీ జీవన్‌గౌన్‌ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. మనోహరాబాద్‌లో ఒక్కో ఎకరం కోటిపైనే ఉంటుంది. ఇక్కడ నాలుగున్నర ఎకరాల మ్యూటేషన్‌ కోసం ఎకరం భూమి రిజిస్ట్రేషన్ చేయాలని డిమాండ్‌ చేసినట్టు సమాచారం. బాధితులు అంగీకరించకపోవడంతో ఇప్పటికీ ఆ ఫైల్‌ పెండింగ్‌లోనే ఉంది. నేషనల్‌ హైవే పక్కనే ఉన్న రామాయంపేట, చేగుంట, తూప్రాన్ ప్రాంతాల్లో కొన్ని స్థలాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు సమాచారం. ఏసీబీ అధికారుల విచారణ పూర్తయితే.. మొత్తం గుట్టుబయటికి వచ్చే అవకాశం ఉంది.

Tags

Read MoreRead Less
Next Story