గుర్తుకొస్తున్నాయి.. చిన్ననాటి ఙ్ఞాపకాలు.. : కేటీఆర్ ట్వీట్ వైరల్

గుర్తుకొస్తున్నాయి.. చిన్ననాటి ఙ్ఞాపకాలు.. : కేటీఆర్ ట్వీట్ వైరల్
ట్వీట్ నిజంగానే కేటీఆర్‌ని ఆలోచింపజేసిందేమో..

భాగ్యనగరంలో బస్సు ప్రయాణం ఓ అందమైన ఙ్ఞాపకం.. ఇప్పుడు కాదు మన చిన్నప్పుడు.. అప్పట్లో డబుల్ డెక్కర్ బస్సులు కూడా ఉండేవి.. వాటిల్లో ప్రయాణం చేస్తూ గమ్యస్థానాలకు చేరుకోవడం భలే మజాగా ఉండేది.. ఇప్పుడు ఆ బస్సులన్నీ ఏమైపోయాయి.. మచ్చుకి ఒక్కటైనా కనిపించట్లేదు.. కేటీఆర్ సార్ వాటి గురించి ఓసారి ఆలోచించకూడదు అంటూ షాకీర్ హుస్సేన్ అనే యువకుడు అలనాటి డబుల్ డెక్కర్ బస్సులను గుర్తు చేస్తూ ఐటీ మినిస్టర్ కేటీఆర్‌కు ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.

ఒకప్పుడు డబుల్ డెక్కర్ బస్సు సికింద్రాబాద్ నుంచి జూపార్క్ మార్గంలో 7 నెంబర్‌తో నడిచేవి.. ఈ బస్సులు జూపార్క్ నుంచి హైకోర్టు, అఫ్జల్‌గంజ్, అబిడ్స్, హుస్సేన్ సాగర్, రాణిగంజ్ మీదుగా సికింద్రాబాద్‌కు చేరుకునేవి. ఈ మహానగరంలో మళ్లీ అలాంటి బస్సులను చూడలేమా సార్.. వీలైతే డబుల్ డెక్కర్ బస్సులను టూరిస్టుల కోసం లేదా ప్రయాణికుల కోసం తీసుకురావొచ్చు కదా.. ఆలోచించండి అంటూ హుస్పేన్ ట్వీట్ చేశారు.

హుస్సేన్ చేసిన ట్వీట్ నిజంగానే కేటీఆర్‌ని ఆలోచింపజేసిందేమో.. ఆయన కూడా తన స్కూల్ రోజులను, చిన్న నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.. తాను కూడా అబిడ్స్ లోని సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్లో చదువుతున్నప్పుడు.. ఆ దారిలో వెళుతుంటే డబుల్ డెక్కర్ బస్సులు కనిపించేవని గుర్తు చేసుకున్నారు. ఆ బస్సులు ఎందుకు ఆపేశారో తనకి కూడా తెలియదని అన్నారు. ఈ బస్సులు మళ్లీ రోడ్లపైకి తీసుకు వచ్చే అవకాశం ఏదైనా ఉందా అంటూ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కి కేటీఆర్ ట్వీట్ చేశారు.. దీంతో కేటీఆర్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.

Tags

Read MoreRead Less
Next Story