గ్రామీణ ప్రాంతాల్లో దాదాపుగా భూ సమస్యలు తొలగిపోయాయి : మంత్రి కేటీఆర్

గ్రామీణ ప్రాంతాల్లో దాదాపుగా భూ సమస్యలు తొలగిపోయాయి : మంత్రి కేటీఆర్

జిహెచ్ఎంసి పరిధిలో రెవెన్యూ సమస్యలపై మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, కాలనీ సంఘాల ప్రతినిధులు వీడియో కాన్ఫరెన్స్‌ సమావేశంలో పాల్గొన్నారు. హైదరాబాద్ నగరం గత 6 సంవత్సరాల్లో దేశంలోని లక్షలాది మందికి ఆకర్షణీయ గమ్యస్థానంగా మారిందన్నారు మంత్రి కేటీఆర్. ఒకవైపు పెట్టుబడులు మరోవైపు పరిపాలనా సంస్కరణలు, రాజకీయ స్థిరత్వంతో పెద్ద ఎత్తున హైదరాబాద్ విస్తరిస్తుందన్నారు.

ప్రభుత్వం నూతన రెవెన్యూ చట్టం తీసుకువచ్చి ప్రతి ఒక్కరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా తమ భూముల పైన హక్కులు కల్పించాలనే లక్ష్యంతో ముందుకు పోతుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సామాన్యుడిపై ఏలాంటి భారం పడకుండా అవినీతికి పాతర వేస్తూ నూతన చట్టానికి తీసుకొచ్చామన్నారు మంత్రి. రాష్ట్రంలో భవిష్యత్తులో అన్ని రిజిస్ట్రేషన్లు ధరణి పోర్టల్ ఆధారంగానే జరుగుతాయన్నారు. వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తులకి ప్రత్యేకంగా రెండు వేరు వేరు రంగుల్లో పాస్ పుస్తకాలు ఇస్తామన్నారు కేటీఆర్.

ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో దాదాపుగా భూ సమస్యలు తొలగిపోయాయని.. ప్రస్తుతం వ్యవసాయేతర ఆస్తుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు కేటీఆర్. హైదరాబాద్ నగరంలో వివిధ కారణాలతో కొన్ని ఆస్తుల హక్కులపై సమస్యలు ఉన్నాయన్నారు. హైదరాబాద్ ప్రజలు నిశ్చింతగా వారి ఆస్తి హక్కులను పొందేలా, సమస్యలను పరిష్కరించేలా, పేద, మధ్యతరగతి ప్రజలకు వారి ఆస్తుల పట్ల హక్కులు కల్పించాలని ప్రయత్నం చేస్తున్నామన్నారు కేటీఆర్. భవిష్యత్తులో హైదరాబాద్లోని ఆస్తుల క్రయ విక్రయాల్లో ఇబ్బందులు లేకుండా చూడడం జరుగుతుందని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. రానున్న 15రోజుల పాటు ధరణి పోర్టల్ లో ఆస్తుల నమోదు కార్యక్రమంలో ప్రజాప్రతినిధులంతా చురుగ్గా పాల్గొనాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎవరు కూడా దళారులను నమ్మవద్దని ఒక్కపైసా ఇవ్వవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను అన్నారు మంత్రి కేటీఆర్.

Tags

Read MoreRead Less
Next Story