తెలంగాణలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు కొనసాగుతున్న నామినేషన్ల ప్రక్రియ

తెలంగాణలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు కొనసాగుతున్న నామినేషన్ల ప్రక్రియ
తెలంగాణలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 23వ తేదీ వరకు సాగనుంది.

తెలంగాణలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. తొలి రోజు మూడు నామినేషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్‌ నుంచి డాక్టర్ చిన్నారెడ్డి, స్వతంత్ర అభ్యర్ధులుగా సయ్యద్ ఫరీదుద్దీన్, అడపా సురేందర్ నామినేషన్ వేశారు. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్ దాఖలుచేయగా.. అధికార టీఆర్ ఎస్ మాత్రం రెండు చోట్ల అభ్యర్థులను నిలబెడుతుందా లేదా అనేది సందిగ్ధంగా మారింది. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ తోపాటు ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 23వ తేదీ వరకు సాగనుంది. నామినేషన్ వేసిన అభ్యర్ధులు ఇప్పటికే ప్రచారంలో నిమగ్నమయ్యారు.

కాంగ్రెస్‌ అభ్యర్థులు ప్రచారంలో దూకుడు పెంచారు. సూర్యాపేట జిల్లా కోదాడలో కాంగ్రెస్‌ కార్యకర్తలతో పరిచయ కార్యక్రమంలో పాల్గొన్నారు వరంగల్‌, ఖమ్మం, నల్గొండ జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థి రాములు నాయక్‌.. ప్రజా శ్రేయస్సు కోసం గళం విప్పే గొంతును మండలికి పంపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. నిరుద్యోగులను మసం చేసిన టీఆర్‌ఎస్‌కు ఓట్లు అడిగే అర్హత లేదన్నారు.

సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో రాములు నాయక్‌తోపాటు టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పాల్గొన్నారు. నిరుద్యోగులకు భృతి కావాలంటే టీఆర్‌ఎస్‌ను ఓడించాలని పిలుపునిచ్చారు.

ఇక ఖమ్మం, వరంగల్, నల్గొండ స్థానానికి టీఆర్‌ఎస్‌ నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డికే మళ్ళీ టిక్కెట్ ఖరారైంది. ఇక్కడ టీఆర్‌ఎస్‌కు సిట్టింగ్ స్థానం అయినప్పటికీ ఈ సారి గట్టి పోటీ ఉండనుంది. కాంగ్రెస్ నుంచి రాములు నాయక్, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి తోపాటు ప్రొఫెసర్ కోదండరాం, విజయ సారథి, చెరుకు సుధాకర్, రాణి రుద్రమ, తీన్మార్ మల్లన్న బరిలో ఉన్నారు. ఎవరికి వారు పోటాపోటీగా గత కొంతకాలంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.

అయితే నిరుద్యోగ భృతితో పాటు ఉద్యోగుల వేతన సవరణ అమలు కాకపోవడంతో ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గులాబీ పార్టీకి ఇబ్బందులు తప్పవని విపక్షాలు భావిస్తున్నాయి. పరిస్థితిని గమనించిన పల్లా రాజేశ్వర్ రెడ్డి గత రెండు నెలలుగా ప్రజా క్షేత్రంలోకి దిగి ప్రచారం చేపట్టారు.

అటు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌ నగర్ స్థానానికి పోటిచేసేందుకు టీఆర్‌ఎస్‌ విముఖత చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ ఎప్పుడూ గెలువకపోవడం అందుకు కారణంగా కనిపిస్తోంది. ఒక వేళ బరిలో ఉంటే.. మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మర్రిరాజశేఖర్ రెడ్డి, మాజీ ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి తో పాటు మరికొన్ని పేర్లను అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లుగా వార్తలొస్తున్నాయి. కానీ ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్సీ రామచందర్ రావు , మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ నాగేశ్వర్, కాంగ్రెస్ నుండి చిన్నారెడ్డి బరిలో నిలవడంతో గట్టి పోటీ ఉంటుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story