MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికలకు గెట్ రెడీ..

MLC Elections (tv5news.in)

MLC Elections (tv5news.in)

MLC Elections: తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా మోగింది.

MLC Elections: తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా మోగింది. ఖాళీగా ఉన్న ఆరు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు ఈసీ.. షెడ్యూల్‌ విడుదల చేసింది. నవంబర్‌ 9న నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. 16వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 17న నామినేషన్ల పరిశీలన, 22న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. నవంబర్‌ 29న ఉదయం 9గంటల నుండి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ జరుగనుంది. అదే రోజు ఐదు గంటలకు కౌంటింగ్ జరిపి ఫలితాలు ప్రకటిప్తారు.

నిజానికి ఆరు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయి దాదాపు అయిదు నెలలవుతోంది. గుత్తా సుఖేందర్‌రెడ్డి, నేతి విద్యాసాగర్‌, బోడకుంటి వెంకటేశ్వర్లు, కడియం శ్రీహరి, ఫరీదుద్దీన్‌, ఆకుల లలిత.. పదవీకాలం జూన్‌ 3వ తేదీతో ముగిసింది. సాధారణంగా గడువు ముగిసే సమయానికంటే ముందే ఆ ఖాళీలను భర్తీ చేసేందుకు ఈసీ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేస్తుంది. అయితే, కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ తీవ్రత నేపథ్యంలో అప్పట్లో ఎన్నికలు నిర్వహించలేదు. ప్రస్తుతం కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు తెరలేపింది.

ఎమ్మెల్సీ ఖాళీలు ఆరు మాత్రమే ఉన్నా.. ఆశావహుల సంఖ్య చాంతాడులా ఉంది. అసెంబ్లీలో మెజారిటీ ఉన్న టీఆర్‌ఎస్‌ ఖాతాలోనే ఈ ఆరు ఎమెల్సీలు పదవులు చేరనున్నాయి. ఇప్పటికే అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దగ్గర ఎమ్మెల్సీ పదవుల కోసం చాలామంది దరఖాస్తు చేసుకున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉంది.

పదవీకాలం పూర్తయిన ఆరుగురిలో ఒకరిద్దరికి మాత్రమే రెన్యువల్ అయ్యే ఛాన్స్ ఉందని సమాచారం. శాసనమండలి చైర్మన్ గా వ్యవహరించిన గుత్తా సుఖేందర్ రెడ్డికి రెన్యువల్ ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. నల్గొండ జిల్లాకే చెందిన డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ రావుకు ఇప్పటికే ఒకసారి రెన్యువల్ చేసినందున ఈసారి అవకాశం లేదని తెలుస్తోంది. ఈ జిల్లా నుండి ఎం.సి కోటిరెడ్డికి నాగార్జునసాగర్ బై ఎలక్షన్స్ సమయంలో అధినేత కేసీఆర్ హామీ ఇచ్చారు .

అయితే ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఇద్దరూ రెడ్డి సామాజిక వర్గానికే అవకాశం ఉందా లేదా అనేది చూడాలి. మరో సీనియర్ నేత కడియం శ్రీహరి, ఫరీదుద్దీన్, ఆకుల లలితకు రెన్యువల్ చేస్తారా అనే సందేహం నెలకొంది. వరంగల్ జిల్లాకు చెందిన బోదకుంటి వెంకటేశ్వర్లుకు రెన్యూవల్ కాకపోతే ఆ జిల్లా నుంచి మరో సీనియర్ లీడర్ కు ఛాన్స్ దక్కే అవకాశం ఉంది.

ఇక మహబూబ్‌ నగర్ జిల్లాకు చెందిన స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి కూడా ఎమ్మెల్సీ పదవి కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , ఒకరిద్దరు మాజీ ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీ రేసులో ఉన్నారు . ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రవణ్ కుమార్ రెడ్డి పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి.

ఇక ఈ మధ్య ఇతర పార్టీల నుంచి టిఆర్ఎస్‌లో చేరిన సీనియర్లు ఎల్ రమణ, పెద్దిరెడ్డి, మోత్కుపల్లి నరసింహులుకు ఎమ్మెల్సీ హామీ గట్టిగానే లభించిందన్న ప్రచారం జరిగింది. కొత్తగా చేరిన వారిలో ఒకరిద్దరికి గులాబీ బాస్ సముచిత స్థానం ఇచ్చే అవకాశం ఉంది. టీఆర్ఎస్ కున్న సంఖ్యాబలంతో ఈజీగా ఆరు ఎమ్మెల్సీలను దక్కించుకోవచ్చు. కాబట్టి అధినేత ఆశీస్సులు ఎవరికి దక్కుతాయో అనేది ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Tags

Read MoreRead Less
Next Story