Hyderabad : దొంగలను ఎదుర్కొన్న తల్లీకుమార్తెలు

Hyderabad : దొంగలను ఎదుర్కొన్న తల్లీకుమార్తెలు
వెల్లువెత్తుతున్న ప్రశంసలు

గతంలో పనికోసం వచ్చిన వారే ఇంటికి కన్నం వేయాలని చూశారు. రెక్కీ నిర్వహించి, మహిళలు ఉన్నప్పుడు దాడి చేద్దాం అని అనుకున్నారు. కానీ ఒక్కసారిగా సీన్‌ రివర్స్‌ అయింది. దుండగుల చేతిలో ఆయుధాల్ని చూసి అదరలేదు..! తల్లీకుమార్తె ధైర్యంగా తిరగబడి దొంగలను తరిమికొట్టారు.

సికింద్రాబాద్‌ బేగంపేట పోలీసుస్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ ఘటనలో తల్లీ కుమార్తె ధైర్యానికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. రసూల్‌పురాలోని హౌసింగ్ కాలనీలో నివాసముంటున్న మహావీర్ జైన్‌ ఇంటికి కన్నం వేయాలని సుశీల్‌ కుమార్‌, ప్రేమ్‌ చంద్ర అనే ఇద్దరు పథకం రచించారు. ఇందుకు తగ్గట్టుగానే... గురువారం మధ్యాహ్నం సుమారు రెండు గంటల సమయంలో ఆ ఇంటికి చేరుకున్నారు. కొరియర్‌ వచ్చిందంటూ ఇంట్లోదాకా వచ్చి... మారణాయుధాలతో ఇంట్లోని మహిళలతో సహా పనిమనుషులను బెదిరించారు. కానీ, ఆ తల్లీకుమార్తె ధైర్యంగా ఎదురు తిరిగారు. కాల్చిపారేస్తామంటూ భయపెట్టినా వెనుకడుగు వేయలేదు.! దొంగలపై తిరగబడి హడలెత్తించారు. మార్షల్‌ ఆర్ట్స్‌పై పట్టు ఉన్న అమిత దెబ్బలకు తాళలేక.. సుశీల్‌ అనే నిందితుడు ముందుగా పరారయ్యాడు. ఇదే సమయంలో ఆమె కుమార్తె కూడా ధైర్యంగా దొంగ భరతం పట్టింది.

కొంతకాలం క్రితం పనికోసం వచ్చిన వారే ఇప్పుడు దొంగతనానికి విఫలయత్నం చేశారని బాధిత మహిళ పేర్కొంది. ఎక్కడెక్కడ ఏం ఉన్నాయో చూసి ఈ దోపిడీకి యత్నిస్తున్నట్లుగా అనిపిస్తుందని అమిత తెలిపింది.తన తల్లిపై జరుగుతున్న దాడినిచూసి మానసికంగా ధైర్యంతోనే దొంగలను తరిమికొట్టామని అమిత కుమార్తె తెలిపింది...

నార్త్‌ జోన్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని తల్లి కుమార్తెల ధైర్యాన్నిప్రశంసించారు. వీరిద్దరిని సత్కరించారు. నిందుతుల నుంచి ఒక నాటు తుపాకీ, రబ్బర్ బుల్లెట్‌ షెల్‌, రెండు కత్తులు, గిఫ్ట్‌ పేపర్ బాక్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మహిళలు ఆత్మరక్షణ విద్యల్లో శిక్షణ తీసుకోవాలని సూచించారు. ఇంట్లోకి చొరబడి దొంగతనానికి యత్నించిన ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన సుశీల్‌కుమార్‌, ప్రేమ్‌చంద్రను పోలీసులు అరెస్టు చేశారు

Tags

Read MoreRead Less
Next Story