ఈటల సహా ప్రభుత్వంలో అందరూ కబ్జాకోరులే : బండి సంజయ్

ఈటల సహా ప్రభుత్వంలో అందరూ కబ్జాకోరులే : బండి సంజయ్
ఈటల రాజేందర్‌పై భూకబ్జా ఆరోపణలు రావడం, సీఎం కేసీఆర్‌ ఆగమేఘాల మీద విచారణకు ఆదేశించడంపై రాజకీయాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది.

ఈటల రాజేందర్‌పై భూకబ్జా ఆరోపణలు రావడం, సీఎం కేసీఆర్‌ ఆగమేఘాల మీద విచారణకు ఆదేశించడంపై రాజకీయాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. ఈటలపై విచారణ జరగాల్సిందే అంటూనే.. ఒక్క ఈటలనే ఎందుకు టార్గెట్‌ చేయాల్సి వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఈటల సహా ప్రభుత్వంలో అందరూ కబ్జాకోరులేనంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. మల్లారెడ్డి, వినయ్‌‌ భాస్కర్, వివేక్‌గౌడ్, యాదిరెడ్డి, శ్రీనివాస్ గౌడ్‌తో పాటు సీఎం కుటుంబం మీద సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాల్సిందేనని డిమాండ్ చేశారు.

అవినీతిని కేసీఆర్ కూడా రెండు రకాలుగా విభజించారని, అనుకూల మంత్రులపై ఆరోపణలు వస్తే పట్టించుకోరు గాని.. తనకు వ్యతిరేకంగా ఉన్న మంత్రులపై ఆరోపణలు వస్తే మాత్రం వెంటనే విచారణలు చేస్తారని కామెంట్ చేశారు. ఇంటర్ విద్యార్ధులు చనిపోయినప్పుడు కేటీఆర్‌పై ఆరోపణలు వస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. ప్రస్తుతం టీఆర్‌‌‌‌ఎస్‌‌ పార్టీలో ఓనర్లు, జీతగాళ్ల కొట్లాట నడుస్తోందన్నారు.

బీజేపీ నేత విజయశాంతి సైతం ఈటల ఎపిసోడ్‌పై కామెంట్ చేశారు. లక్ష కోట్లు మింగిన దొర కుటుంబం.. బడుగు, బలహీనవర్గాలపై చేస్తున్న అణచివేతల ప్రక్రియలో తమ్ముడు ఈటల రాజేందర్‌ది మరో దుర్మార్గమని విజయశాంతి విమర్శించారు. ఈ దొర అహంకారపు ధోరణుల నుంచి తెలంగాణ ప్రజలకు త్వరలోనే విముక్తి తప్పక లభించి తీరుతుందని అన్నారు.

మంత్రి ఈటలను బలిపశువును చేసేందుకే టార్గెట్ చేశారని అన్నారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్. అందుకే అసైన్డ్ భూముల వ్యవహారంలో మంత్రిని ఇరికించే కుట్ర చేస్తున్నారని విమర్శించారు. కేటీఆర్, కేసీఆర్ ఫామ్ హౌస్‌ల వ్యవహారం ఎందుకు బయటికి రావడం లేదని ప్రశ్నించారు. మంత్రి మల్లా రెడ్డి అవినీతి ఆరోపణలు, భూ కబ్జాలు బయట పడ్డా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. కరోనా నియంత్రణలో కేసీఆర్ ఫెయిల్యూర్ అయ్యారని, మంత్రి ఈటెల ఎంతో కస్టపడి పనిచేస్తున్నారని అన్నారు.

తెలంగాణలో ఉద్యమకారులను అణచివేస్తున్నారన్నారు TJS అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం. పార్టీకి, ప్రభుత్వానికి ఓనర్లం అన్నందుకే ఈటలపై కుట్ర పన్నారని ఆరోపించారు. ఇది భూవివాదం కాదు.. ఈటలను అణచివేసే కార్యక్రమమన్నారు. ఈ హడావుడి ఇతర వివాదాలపై ఎందుకు లేదని ప్రశ్నించారు. కేసీఆర్ ఆగడాలకు వ్యతిరేకంగా ఐక్యం కావాలని పిలుపునిచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story