TS News: తెలంగాణలో అయ్యర్‌ కమిటీ పర్యటన

TS News: తెలంగాణలో   అయ్యర్‌ కమిటీ పర్యటన
అధికారులను ప్రశ్నించిన ఎన్‌డీఎస్‌ఏ నిపుణుల కమిటీ

మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల ఆనకట్టల నిర్మాణానికి సంబంధించిన డిజైన్స్, నాణ్యత, నిర్వహణ అంశాలపై నిపుణుల కమిటీ ప్రధానంగా దృష్టి సారించింది. సంబంధిత విభాగాల ఇంజనీర్లతో సమావేశమై వివరాలను సేకరించింది. విశ్రాంత ENCలు మురళీధర్, వెంకటేశ్వర్లుతోనూ చర్చించిన కమిటీ మేడిగడ్డ ఆనకట్ట కుంగుబాటు కారణాల గురించి ఆరా తీసింది. ఇవాళ కూడా CDO ఇంజినీర్లతో పాటు నిర్మాణ సంస్థల ప్రతినిధులతో కమిటీ సమావేశం కానుంది.

మేడిగడ్డ ఆనకట్టలో పియర్స్ కుంగడంతో పాటు అన్నారం ఆనకట్టలో సీపేజీ సమస్య వచ్చిన తరుణంలో రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు జాతీయ ఆనకట్టల భద్రతా ప్రాధికార సంస్థ – NDSA నియమించిన నిపుణుల కమిటీ రాష్ట్రంలో రెండో దఫా పర్యటిస్తోంది. నిన్న హైదరాబాద్ వచ్చిన చంద్రశేఖర్ అయ్యర్ కమిటీ వివిధ విభాగాల ఇంజినీర్లతో సమావేశమైంది. గతంలో ENC జనరల్‌గా బాధ్యతలు నిర్వర్తించిన మురళీధర్, రామగుండం ENCగా ఉండి.. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టల నిర్మాణాన్ని పర్యవేక్షించిన నల్లా వెంకటేశ్వర్లుతో కూడా కమిటీ సమావేశమైంది. మొదట వెంకటేశ్వర్లుతో సమావేశమైన కమిటీ మూడు ఆనకట్టల అంశాలకు సంబంధించిన అంశాలపై ఆరా తీశారు. ఇన్వెస్టిగేషన్స్ మొదలు.. నిర్మాణం, నాణ్యత, నిర్వహణ అంశాల గురించి తెలుకున్నారు. మురళీధర్‌తో విడిగా సమావేశమైన కమిటీ మేడిగడ్డలో పియర్స్ ఎందుకు కుంగి ఉండవచ్చో అడిగారు. దిగువన ఇసుక కదలిక, సీకెంట్ ఫైల్స్ తదితరాల గురించి అడిగినట్లు సమాచారం. ENC జనరల్, హైడ్రాలజీ ఇన్వెస్టిగేషన్, సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ ఇంజినీర్లతో కమిటీ విడివిడిగా సమావేశమైంది. వ్యాప్కోస్ సంస్థ చేసిన సర్వే, దాని తనిఖీ గురించి ఆరా తీశారు. DPR, డిజైన్ల గురించి ప్రధానంగా వివరాలు తెలుసుకున్నారు. హైడ్రాలజీ ఇన్వెస్టిగేషన్స్‌కు సంబంధించిన వివరాలు తీసుకున్నారు. ఆనకట్టల నిర్మాణానికి సంబంధించి మొదట పెట్టిన గడువు, ఆ తర్వాత తక్కువ సమయంలో పూర్తి చేయాల్సిన పరిస్థితి, నిర్మాణ క్రమంలో తీసుకున్న జాగ్రత్తలు, క్వాలిటీ కంట్రోల్ గురించి ఇంజినీర్లను అడిగారు.

తక్కువ సమయంలోనే పూర్తి చేసినపుడు నాణ్యత గురించి ఎటువంటి తనిఖీలు చేశారని ప్రశ్నించిన కమిటీ... ఎక్కడైనా లోపాలు ఉంటే ఎవరి దృష్టికి తీసుకెళ్లారని ఆరా తీసినట్లు తెలిసింది. ఆనకట్టల ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్‌కు సంబంధించి కూడా వివరాలు పూర్తిగా తీసుకున్నట్లు సమాచారం. నిర్వహణకు సంబంధించిన పర్యవేక్షణ ఎలా జరిగిందని, 2019 లో సమస్యలు వచ్చినప్పటి నుంచి తీసుకున్న చర్యలు, చేసిన తనిఖీల గురించి ఆరా తీశారు. వాటి అన్నింటికి సంబంధించి సమగ్ర నివేదిక ఇవ్వాలని కమిటీ సూచించింది. ఆనకట్టల డిజైన్స్, నాణ్యత, నిర్వహణ అంశాలపై కమిటీ ప్రధానంగా దృష్టి సారించింది. వివిధ దశల్లో మానవ లోపం వల్లే సమస్య ఉత్పన్నమైనట్లు భావిస్తున్న కమిటీ... ఆ దిశగానే ఇంజినీర్ల నుంచి సమాచారం రాబట్టుతున్నట్లు తెలుస్తోంది. ఏ ఆమోదానికి ఎవరు బాధ్యులు? జవాబుదారీతనం ఎవరింది? లోపాలను గుర్తించాల్సిన వారు ఎవరు? ఏం చేశారు? అన్న కోణంలో ప్రశ్నలు అడుగుతున్నట్లు సమాచారం.

Tags

Read MoreRead Less
Next Story