PROJECTS: నేటి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు పరిశీలించనున్న కేంద్ర కమిటీ

PROJECTS: నేటి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు పరిశీలించనున్న కేంద్ర కమిటీ
టీ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల సందర్శన... NDSA ఛైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ

కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ఆరుగురి నిపుణుల కమిటీ నేటి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించనుంది. NDSA ఛైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజిలను సందర్శించనుంది. రెండ్రోజుల పాటు డ్యామ్‌లను సందర్శించి డిజెన్లు, నిర్మాణాలను ఈ కమిటీ పరిశీలిస్తుంది. కమిటీకి అవసరమైన సహకారం అందించేందుకు నీటిపారుదల శాఖ యంత్రాంగం సిద్దంగా ఉందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీ కుంగుబాటు, పగుళ్లకు కారణాలను విశ్లేషించి, ప్రత్యామ్నాయాల సిఫార్సుల కోసం నియమించిన ప్రత్యేక కమిటీ రంగంలోకి దిగింది. ఈ మేరకు రెండ్రోజుల పాటు ప్రాజెక్టులను సందర్శించి పూర్తిస్థాయిలో అధ్యయనం చేయనుంది.


కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ కుంగుబాటు, అన్నారం లీకేజీతో అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్ర జలశక్తి శాఖకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్ల పరిశీలన, నిర్మాణాలపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసేందుకు జాతీయ డ్యాం సేప్టీ అథారిటీ - NDSA ఆరుగురు నిపుణులతో కూడిన కమిటీ ఏర్పాటు చేసింది. కేంద్ర వాటర్‌ కమిషన్‌కు చెందిన చంద్రశేఖర్‌ అయ్యర్‌ ఛైర్మన్‌గా UC విద్యార్థి, R.పాటిల్‌, శివకుమార్‌ శర్మ, రాహుల్‌ కుమార్‌ సింగ్‌, అమితాబ్‌ మీనాలు సభ్యులుగా ఏర్పాటైన కమిటీ నిన్న హైదరాబాద్‌ చేరుకుంది.

తెలంగాణ ప్రభుత్వం కోరిన వెంటనే కేంద్ర జలశక్తి శాఖ నిపుణుల కమిటీ వేసి, మేడిగడ్డ ప్రాజెక్టు పరిశీలనకు పంపడంపై మంత్రి ఉత్తమ్‌ హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ జలసౌధలో ఈ నిపుణుల కమిటీ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో సమావేశమైంది. కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితిని మంత్రి.... పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వారికి వివరించారు. నిపుణుల కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని స్పష్టం చేసిన మంత్రి సాధ్యమైనంత త్వరగా నివేదిక అందజేయాలని కోరారు. మేడిగడ్డను తిరిగి ఉపయోగంలోకి తెస్తామని నిపుణుల బృందం చెప్పినట్లు మంత్రి వెల్లడించారు. సమస్యకు కారణం ఎవరనేది కూడా నివేదికలో పొందుపరచాలని కోరినట్లు ఉత్తమ్‌ చెప్పారు.


ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ నిపుణుల బృందం ఇవాళ మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనుంది. కాసేపట్లో మేడిగడ్డకు బయలుదేరనున్న కమిటీ మధ్యాహ్నం ఒకటిన్నర గంటల వరకూ బ్యారేజీని పరిశీలించనుంది. ప్రధానంగా కుంగుబాటుకు దారితీసిన కారణాలను బృందం అధ్యయనం చేయనుంది. బ్యారేజీ పగుళ్లు కారణంగా ఆనకట్ట సామర్ధ్యం గేట్ల పరిస్ధితి సమగ్రంగా విశ్లేషించి ఎలాంటి మరమ్మతులు అవసరమో సిఫార్సులు చేయనుంది. మధ్యాహ్నం భోజనానంతరం.... అధికారుల బృందం, అన్నారం బయలుదేరనుంది. బ్యారేజీలో సీపేజీకి దారితీసిన కారణాలను సమగ్రంగా పరిశీలించనుంది.

Tags

Read MoreRead Less
Next Story