జనతాపార్టీ నుంచి రాజకీయ జీవితం ప్రారంభించిన నాయిని..

జనతాపార్టీ నుంచి రాజకీయ జీవితం ప్రారంభించిన నాయిని..

తెలంగాణ మొట్టమొదటి హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన... అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గత నెలలో నాయిని నర్సింహారెడ్డి కరోనా వైరస్‌ బారిన పడి కోలుకున్నారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత శ్వాస సంబంధ సమస్యలు వచ్చాయి. వైద్య పరీక్షల్లో న్యూమోనియా అని తేలింది. కరోనా కారణంగా కలిగిన న్యూమోనియాతో ఊపిరితిత్తులు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. ఆయన తుదిశ్వాస విడిచినట్లు డాక్టర్లు ప్రకటించారు.

ఆయన ఆరోగ్యంగా కోలుకుని తిరిగి వస్తారని అంతా అనుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు ఆయన మరణ వార్త అందరిని తీవ్ర బాధల్లోకి నెట్టేసింది.నాయిని మృతికి సీఎం కేసీఆర్‌ సంతాపం వ్యక్తం చేశారు. అంతకుముందు ఆస్పత్రికి వెళ్లిన కేసీఆర్‌.. నాయిని కుటుంబ సభ్యులతో మాట్లాడారు. డాక్టర్లను అడిగి ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. నాయినికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లుకు సూచించారు. కానీ ఇంతలోనే ఆయన మరణించారన్న వార్త అందడంతో.. ఆయనకు సంతాపం వ్యక్తం చేశారు.

ముక్కుసూటి వ్యక్తి, ధైర్యశాలిగా, కార్మిక పక్షపాతిగా నాయిని నర్సింహారెడ్డికి మంచి పేరుంది. తెలంగాణ తొలితరం ఉద్యమకారుల్లో ఒకరైన నాయిని నర్సింహారెడ్డి 1944 మే 12 వ తేదీన నల్గొండ జిల్లా దేవరకొండ మండలం నేరేడుగొమ్ము గ్రామంలో జన్మించారు. సుభద్రమ్మ, దేవయ్య రెడ్డి.. నాయిని తల్లిదండ్రులు. HSC వరకు చదివిన నాయిని... 1969 తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. ఆ తర్వాత VST ఇండస్ట్రీస్‌లో కార్మిక నేతగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత జనతాపార్టీ నుంచి రాజకీయ జీవితం ప్రారంభించి.. ముషీరాబాద్‌ నుంచి ఎమ్మెల్యేగా రెండుసార్లు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2004 లో మరోసారి ముషీరాబాద్‌ నుంచే గెలిచి.. వైఎస్‌ మంత్రివర్గంలో సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నాయిని.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మొదటి హోం మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. వయోభారం రిత్యా 2018 లో ఎన్నికల బరిలో నాయిని దిగలేదు.

Tags

Read MoreRead Less
Next Story