హైదరాబాద్‌లో విషాదాంతంగా మారిన బాలిక అదృశ్యం

హైదరాబాద్‌లో విషాదాంతంగా మారిన బాలిక అదృశ్యం
మాదావశాత్తు బాలిక నాళాలో పడి కొట్టుకుపోయిందా? లేక ఎవరైనా హత్య చేసి బాలికను చెరువులో పడేశారా?

హైదరాబాద్‌లో బాలిక అదృశ్యం విషాదాంతంగా మారింది. సైకిల్ తొక్కుతూ ఆడుకుంటున్న బాలిక చెరువులో శవమై తేలింది. బాలిక డెడ్ బాడీని పోలీసులు, జీహెచ్‌ఎంసీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సిబ్బంది బయటకు తీశారు. నాళాలో పడిపోయిన బాలిక 3 కిలోమీటర్ల దూరం కొట్టుకుపోయి బండ చెరువుకు చేరింది. అయితే బాలిక మరణించిన తర్వాత ఆమె డెడ్ బాడీ కొట్టుకు పోయిందా? లేక కొట్టుకుపోయిన తర్వాత చెరువులో చనిపోయిందా అనేది తేలాల్సి ఉంది.

గురువారం నేరేడ్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంతోషిమాత నగర్‌లో 12 ఏళ్ల సుమేధ అనే బాలిక మిస్ అయ్యింది. ఈ మేరకు పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు స్థానికులను విచారించారు. అయితే బాలిక సైకిల్ తొక్కుతూ ఆడుకుందని స్థానికులు తెలిపారు. దీంతో పోలీసులు ఆ వీధిలో ఉన్న సీసీటీవి ఫుటేజీని కూడా పరిశీలించారు. స్థానికులు చెప్పింది నిజమే అని తేలింది.

వీధిలో గాలించగా ఓ డ్రైనేజీపై బాలిక సైకిల్ దొరికింది. బాలిక డ్రైనేజీలో పడిపోయిందనే అనుమానంతో జీహెచ్‌ఎంసీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సిబ్బంది సహాయంతో డ్రైనేజీలో గాలించారు. కానీ బాలిక ఆచూకీ దొరకలేదు. దీంతో తమ కూతురిని ఎవరైనా కిడ్నాప్ చేసివుంటారని బాలిక తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. అయితే శుక్రవారం కూడా పోలీసులు డిజాస్టర్ మేనేజ్మెంట్ సహాయంతో గాలింపు చేపట్టగా బాలిక శవం బండ చెరువులో లభ్యమైంది. ప్రమాదావశాత్తు బాలిక నాళాలో పడి కొట్టుకుపోయిందా? లేక ఎవరైనా హత్య చేసి బాలికను చెరువులో పడేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరోవైపు బాలిక మరణానికి కారణం జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్యమేనని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డ్రైనేజీలు, వాటిపైకప్పులకు సంబంధించి ఎన్నిసార్లు ఫిర్యాదుచేసినా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. సొంతంగా తామే డ్రైనేజీల పైకప్పులు నిర్మించినా వాటిని సైతం పగులగొట్టేస్తున్నారని అధికారులు, సిబ్బంది తీరుపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story