Top

నేడు తెలంగాణ అసెంబ్లీలో కొత్త రెవెన్యూ చట్టం బిల్లు

నేడు తెలంగాణ అసెంబ్లీలో కొత్త రెవెన్యూ చట్టం బిల్లు
X

దేశానికే ఆదర్శంగా నిలిచేందుకు తెలంగాణ ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టం రూపొందించింది. బుధవారం అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ కొత్త రెవెన్యూ ముసాయిదా బిల్లును ప్రవేశపెడతారు. ఈనెల 10, 11 తేదీల్లో కొత్త రెవెన్యూ చట్టంపై సభలో చర్చ జరగనుంది. సులువుగా, పారదర్శకంగా, స్నేహపూర్వకంగా ప్రజలకు రెవెన్యూ సేవలే ప్రభుత్వం రూపొందించిన కొత్త రెవెన్యూ చట్టం అంతిమ లక్ష్యాలు. అక్రమాలకు తావులేకుండా భూ లావాదేవీలు సులభంగా పూర్తవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ చట్టాన్ని రూపొందించింది. ప్రస్తుతం తెలంగాణలో అమల్లో ఉన్న భూ యాజమాన్య హక్కుల చట్టానికి సవరణ చేస్తూ ఆర్‌ఓఆర్‌-2020ని అమల్లోకి తేనుంది. ఈ మేరకు శాసనసభలో 'తెలంగాణ రైట్స్‌ ఇన్‌ ల్యాండ్‌ అండ్‌ పట్టాదార్‌ పాస్‌బుక్స్‌ బిల్‌-2020ను ప్రవేశపెట్టనుంది. వీఆర్‌ఓ వ్యవస్థ రద్దు చేస్తూ మంత్రివర్గం ఆమోదించిన బిల్లును కూడా సభలో ప్రవేశపెడతారు. కొత్త చట్టం ద్వారా భూ నిర్వహణలో సరికొత్త మార్పులకు ప్రభుత్వం స్వీకారం చుట్టనుంది.

కొత్త చట్టం ద్వారా వ్యవసాయ భూ క్రయవిక్రయాల రిజిస్ట్రేషన్‌ పూర్తికాగానే మ్యుటేషన్‌ వెంటనే పూర్తికానుంది. తెలంగాణ రాష్ట్ర సమగ్ర భూ దస్త్రాల నిర్వహణ విధానంలోని సమాచారం ఆధారంగా ఆటోమేటిక్‌గా మ్యుటేషన్‌ పూర్తికానుంది. 2017లో భూ దస్త్రాల ప్రక్షాళన నిర్వహించడంతో దాని ఆధారంగా ఈ కొత్త విధానాన్ని రూపొందించారు. ఇప్పటికే ప్రభుత్వం రైతులకు డిజిటల్‌ పాసు పుస్తకాలను అందజేసింది. రైతుల భూ దస్త్రాలకు ఆధార్‌ నంబర్లు, ఫోన్‌ నంబర్లను జతచేసింది. వాటి ఆధారంగా లావాదేవీ పూర్తికాగానే రైతు ఫోన్‌కు సంక్షిప్త సమాచారం అందే విధానాన్ని అందుబాటులోకి తెస్తోంది.

ఇకపై ప్రభుత్వం తహసీల్దార్లకు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ అధికారాలను అప్పగిస్తోంది. కొత్త చట్టం ప్రకారం 592 తహసీల్దారు కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్‌ సేవలు ప్రారంభం కానున్నాయి. ఒకేచోట భూముల రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ అందుబాటులోకి రానున్నాయి. వ్యవసాయేతర భూములకు మాత్రం ప్రస్తుతం ఉన్న సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లోనే రిజిస్ట్రేషన్‌ చేస్తారు. సాంకేతికత ఆధారంగా రెవెన్యూ పరిపాలనను నిర్వహించేందుకు కొత్త చట్టం వీలు కల్పిస్తుంది.

ఈ తరహా చట్టం గురించి దేశంలోని ఏ రాష్ట్రం కూడా చేయలేదని, ఆలోచించలేదన్నారు సీఎం కేసీఆర్‌. దేశచరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకువస్తున్నామని వెల్లడించారు. అవినీతి తావులేకుండా, పారదర్శకంగా, వివాదాలకు ఆస్కారం లేకుండా ఈ చట్టం ఉంటుందని చెప్పారు. కొత్త చట్టాన్ని ప్రజల్లో విస్తృతంగా తీసుకొని పోవాలని ప్రజాప్రతినిధులకు ఇప్పటికే సీఎం ఆదేశించారు. అసెంబ్లీలో కొత్త రెవెన్యూ చట్టం బిల్లు పెట్టగానే గ్రామాల్లో ఒక పండుగ వాతావరణం ఉండే విధంగా సంబురాలు జరుపుకోవాలని పిలుపునిచ్చారు.

Next Story

RELATED STORIES