TS: తెలంగాణలో కొలువుదీరిన శాసనసభ

TS: తెలంగాణలో కొలువుదీరిన శాసనసభ
వంద మంది ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం.... సభకు హాజరుకాని కేసీఆర్‌, కేటీఆర్‌, బీజేపీ ఎమ్మెల్యేలు

తెలంగాణ శాసనసభ కొలువుదీరింది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్‌, ఎంఐఎం సభాపక్షనేత అక్బరుద్దీన్‌ ఒవైసీ ప్రమాణం చేయించారు. మొత్తంగా వంద మంది శాసనసభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. MP పదవులకు రాజీనామా చేయని ఉత్తమ్‌, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రమాణం చేయలేదు. మాజీ సీఎం కేసీఆర్‌కు సర్జరీ దృష్ట్యా... ప్రమాణ స్వీకారానికి మాజీ మంత్రి KTR హాజరుకాలేకపోయారు. ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్‌ను ఎంపికను నిరసిస్తూ.. కార్యక్రమానికి భాజపా ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారు..


తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయంసాధించిన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ కొత్త MLAలతో ప్రమాణం చేయించారు. ఈ ఉదయం... రాజ్‌భవన్‌లో ప్రొటెమ్‌ స్పీకర్‌గా ప్రమాణం చేసిన అక్బరుద్దీన్‌...తర్వాత శాసనసభ నిర్వహించారు. సభ ప్రారంభానికి ముందు అందరు ఎమ్మెల్యేల వద్దకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి... అందరినీ పేరుపేరున పలకరించారు. మొదట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులతో.. ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయించారు. అనంతరం... అధికార, విపక్షాలకు చెందిన సభ్యులు ఒక్కొక్కరే ప్రమాణస్వీకారం చేశారు. మాజీ సీఎం కేసీఆర్‌కు సర్జరీ దృష్ట్యా ప్రమాణ స్వీకారానికి కేటీఆర్ రాలేదు. ప్రమాణ స్వీకారానికి తనకు మరో రోజు సమయం ఇవ్వాలని శాసనసభ కార్యదర్శిని ఆయన కోరారు. మాజీ మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్‌ సహా పలువురు గులాబీ ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేశారు. ఎంపీ పదవులకు రాజీనామా చేయని ఉత్తమ్‌, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రమాణం చేయ లేదు.


శాసనసభ సమావేశాలకు బీజేపీ ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. సీనియర్‌ ఎమ్మెల్యేలను కాదని ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్‌ను చేశారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. ప్రొటెం స్పీకర్ సమక్షంలో బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణం చేయరని తేల్చిచెప్పారు. రెగ్యులర్ సభాపతి ఎన్నిక తరువాతే బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణం చేస్తారన్నారు. గన్‌పార్క్‌ వద్ద నివాళలర్పించి శాసనసభ వద్దకు వచ్చిన భాజపా ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేయనందున మీడియా పాయింట్‌లో మాట్లాడే అవకాశం లేదని పోలీసులు తెలపడంతో బీజేపీ శాసన సభ్యులు వెనుదిరిగారు. ప్రమాణస్వీకారం సందర్భంగా సింగరేణి కార్మికుడిలా రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ ఠాకూర్‌ వచ్చి ఆకట్టుకున్నారు.


శాసనసభ్యులుగా ప్రమాణం చేయడానికి ముందే కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి,పల్లా రాజేశ్వర్ రెడ్డి.. శాసనమండలి సభ్యత్వాలకు రాజీనామాలు చేశారు. వెంటనే మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ముగ్గురు రాజీనామాలను ఆమోదించారు. ఈ ముగ్గురిలో పల్లా రాజేశ్వర్ రెడ్డి పట్టభద్రుల కోటాలో మండలికి ఎన్నిక కాగా కడియం శ్రీహరి, కౌశిక్ రెడ్డి శాసనసభ్యుల కోటాలో బీఆర్‌ఎస్‌ తరపున మండలికి ఎన్నికయ్యారు. ఇప్పుడు శాసనసభ్యుల కోటాలో కాంగ్రెస్ , బీఆర్‌ఎస్‌లకు ఒక్కో స్థానం దక్కే అవకాశముంది. పట్టభద్రుల కోటాలో ఎవరు గెలుస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది.

Tags

Read MoreRead Less
Next Story