కవితను 90 శాతం ఓట్ల మెజారిటీతో గెలిపించేందుకు వ్యూహ రచన

కవితను 90 శాతం ఓట్ల మెజారిటీతో గెలిపించేందుకు వ్యూహ రచన
ఉప ఎన్నికను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టిఆర్ఎస్.. కవితను భారీ మెజారిటీతో గెలిపించేందుకు పావులు కదుపుతుంది.

నిజామాబాద్ స్థానిక సంస్థల కోట ఉప ఎన్నికల పోలింగ్‌కు కౌంట్ డౌన్ మొదలయ్యింది. దీంతో ప్రధాన రాజకీయ పార్టీలు ఓట్ల లెక్కల్లో బిజీగా ఉన్నాయి. బలాబలాలను సమీక్షించు కుంటున్నాయి. తమ వారిని కాపాడుకుంటూ ఎదుటి పార్టీ ఓట్లపై గురి పెడుతున్నాయి. టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా మాజీ ఎంపీ కవిత పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్ నుంచి సుభాష్ రెడ్డి, బీజేపీ నుంచి పోతాంకర్ లక్ష్మీనారాయణ బరిలో ఉన్నారు. మొత్తం 824 మంది ఓటర్లున్నారు. అయితే అధికార టీఆర్ఎస్ పార్టీ అత్యధిక మంది స్థానిక ప్రజా ప్రతినిధుల ఓట్ల బలంతో ముందంజలో ఉంది.

ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధికంగా 505 స్థానాలను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకోగా... కాంగ్రెస్ 160, బీజేపీ 85, స్వతంత్రులు 66 స్థానాల్లో గెలిచారు. ఇక టిఆర్ఎస్ 338 ఎంపిటిసిలు, 37 జెడ్పిటిసిలు, కార్పొరేటర్లు కౌన్సిలర్లు కలిపి 115 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ 105 ఎంపిటిసి స్థానాలతో పాటు కార్పొరేటర్లు, కౌన్సిలర్లు కలిపి 30 స్థానాలు, మరో10 మంది జెస్పిటిసిలను గెలుచుకుంది. ఇక బీజేపీ మాత్రం అన్ని స్థానిక సంస్థల్లో కలిపి 85 సీట్లకు పరిమితమైంది. ఎన్నికల తర్వాత రాజకీయ పరిణామాలు మారాయి. చాలా మంది అధికార టిఆర్ఎస్ పార్టీలో చేరేందుకు మొగ్గు చూపారు. గెలిపించిన పార్టీని వదిలేసి గులాబీ కండువా కప్పుకున్నారు.

తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో భారీ మెజారిటీ పై గులాబీ దళం గురిపెట్టింది. ఆ పార్టీ అభ్యర్థి మాజీ ఎంపీ కవితను 90 శాతం ఓట్ల మెజారిటీతో గెలిపించేందుకు వ్యూహ రచన చేస్తున్నారు. ఇప్పటికే ఒక ఫ్లోర్ లీడర్ సహా ఏడుగురు కాంగ్రెస్ జెడ్పిటిసిలు, బీజేపీ నుంచి ఒకరు గులాబీ కండువా కప్పుకున్నారు. మరో వైపు బీజేపీ నుంచి ఏడుగురు కార్పొరేటర్లు, కాంగ్రెస్ నుంచి ఒక కార్పొరేటర్ పలువురు కౌన్సిలర్లు పార్టీ మారారు. దీంతో పొలిటికల్ సీన్ మారిపోయింది. అధికార పార్టీకి బలం మరింత పెరిగింది. తమ పార్టీలోకి వస్తే అభివృద్ధి పనులకు నిధులతో పాటు ఎన్నికల్లో అయిన ఖర్చు భరిస్తామని ప్రలోభ పెడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అదంతా అవాస్తవమని అభివృద్ధిని చూసి ఇతర పార్టీల ప్రజాప్రతినిధులు టిఆర్ఎస్‌లోకి వస్తున్నారని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. ఇక పోలింగ్ నాటికి మరికొంత మంది వస్తారని గులాబీ శ్రేణులు ఆశిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలంతా ఇపుడు ఇదే పనిలో బిజీగా ఉన్నారు. కాంగ్రెస్, బీజేపీ నేతలతో సంప్రదింపులుజరుపుతున్నారు. ఉప ఎన్నికను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టిఆర్ఎస్.. కవితను భారీ మెజారిటీతో గెలిపించేందుకు పావులు కదుపుతుంది.

ఇదిలా ఉంటే టీఆర్ఎస్ పార్టీలోని వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని కాంగ్రెస్ నేతలు గెలుపు పై ధీమాగా ఉన్నారు. అయితే ఎమ్మెల్సీ సీటు కోసం అంగట్లో సరుకులు కొన్నట్లుగా స్థానిక ప్రజా ప్రతినిధులతో బేరమాడుతూ కొనుగోలు చేస్తున్నారని కాంగ్రెస్ మండిపడుతోంది. తమ ప్రజా ప్రతినిధులను భయ బ్రాంతులకు గురి చేస్తూ ప్రలోభ పెడుతూ బలవంతంగా టిఆర్ఎస్‌లో చేర్చుకుంటున్నారని బీజేపీ ఆరోపిస్తోంది.

మొత్తంగా వలస రాజకీయాలతో నిజామాబాద్‌ జిల్లా వేడెక్కింది. భారీ మెజార్టీని కైవసం చేసుకునేందుకు టీఆర్‌ఎస్‌ నేతలు వ్యూహం రచిస్తుంటే... తమ పార్టీ నుంచి వెళ్తున్నవారిని కాపాడుకునే పనిలో కాంగ్రెస్‌, బీజేపీలు ఉన్నాయి.

Tags

Read MoreRead Less
Next Story