KCR: ప్రధాని మోదీని టార్గెట్‌ చేయడం వెనక సీఎం కేసీఆర్ ప్లాన్‌ ఏంటి?

KCR: ప్రధాని మోదీని టార్గెట్‌ చేయడం వెనక సీఎం కేసీఆర్ ప్లాన్‌ ఏంటి?
KCR: ఒక్క కేసీఆర్‌ అనే కాదు.. దేశవ్యాప్తంగా యాంటీ మోదీ స్లోగన్‌ను జపిస్తున్నాయి ప్రాంతీయ పార్టీలు.

KCR: ప్రధాని మోదీని టార్గెట్‌ చేయడం వెనక సీఎం కేసీఆర్ ప్లాన్‌ ఏంటి? యాంటీ మోదీ స్లోగన్ వినిపించడం, ప్రాంతీయ పార్టీల ఐక్యత చాటాలనడం.. ఈ రెండిటి లక్ష్యం ఒక్కటిగానే ఉండడంతో.. కేసీఆర్ వ్యూహం జాతీయ స్థాయిలోనే ఉండబోతోందని కనిపిస్తోంది. మొన్నటి వరకు రాష్ట్ర బీజేపీని, బండి సంజయ్‌ని టార్గెట్‌ చేసిన కేసీఆర్‌.. ఇప్పుడు ఏకంగా మోదీనే లక్ష్యంగా చేసుకున్నారు. ప్రజలు ఆశీర్వదిస్తే తానే ఒక జాతీయ పార్టీ పెడతానంటూ స్టేట్‌మెంట్ ఇచ్చారు సీఎం కేసీఆర్.

ఒక్క కేసీఆర్‌ అనే కాదు.. దేశవ్యాప్తంగా యాంటీ మోదీ స్లోగన్‌ను జపిస్తున్నాయి ప్రాంతీయ పార్టీలు. ఇందుకోసం రీజనల్ పార్టీలు ఐక్యంగా కదలాల్సిన అవసరం ఉందనే చర్చలు పెడుతున్నాయి. ఉత్తరాదిన మమత, కేజ్రీవాల్, అఖిలేశ్ యాదవ్.. దక్షిణాదిన కేసీఆర్, స్టాలిన్ ఒకే రకమైన స్టేట్‌మెంట్స్ ఇస్తున్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్‌, సీఎం స్టాలిన్‌కు ఫోన్‌ చేసి కలిసిరావాలని కోరారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.

ప్రాంతీయ, ప్రతిపక్ష పార్టీల ముఖ్యమంత్రులు త్వరలోనే జట్టు కట్టనున్నట్టు తెలుస్తోంది. వీళ్లంతా ఈ నెలాఖరున ఢిల్లీలో కీలక సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే డీఎంకే అధినేత స్టాలిన్‌కు పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ ఫోన్ చేశారు. త్వరలో ఢిల్లీ వేదికగా జరిగే మీటింగ్‌కు రెడీగా ఉండాలని చెప్పారు. అయితే, గవర్నర్ల వ్యవస్థపై ప్రధానంగా చర్చ జరుగుతుందంటూ స్టాలిన్ ట్వీట్ చేసినప్పటికీ.. మీటింగ్‌ అజెండా అంతకు మించే అని తెలుస్తోంది.

కేసీఆర్‌తో మాట్లాడేందుకు మమత బెనర్జీ త్వరలోనే హైదరాబాద్‌కు రానున్నట్లు వార్తలొస్తున్నాయి. మమత బెనర్జీ ఫోన్ చేసిన విషయాన్ని కేసీఆరే స్వయంగా చెప్పారు. శివసేన అధినేత ఉద్దవ్ థాక్రే సైతం తన సంకేతాల కోసం ఎదురు చూస్తున్నారంటూ కేసీఆర్ చెప్పుకొచ్చారు. త్వరలోనే థాక్రేతో సమావేశం ఉంటుందన్నారు కేసీఆర్.

ఐదు రాష్ట్రాల ఎన్నికల తరువాత రాజకీయ తంత్రం మారుతుందనేది విశ్లేషకుల అంచనా. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ భారీ మెజారిటీతో గెలిస్తే గనక ప్రాంతీయ పార్టీలు కొంతకాలం సైలెంట్ అవుతాయని అంటున్నారు. ఒకవేళ అఖిలేశ్‌ యాదవ్‌ అనూహ్య విజయం సాధిస్తే మాత్రం ఆ తరువాత జరిగే స్టోరీయే వేరంటున్నారు. అఖిలేశ్‌ గెలవకపోయినా సరే.. పోటాపోటీగా సీట్లు సాధించినా అది ప్రాంతీయ పార్టీలకు బలాన్నిచ్చేదే అవుతుంది.

ఇప్పటికే కేంద్రంపై యుద్ధం చేస్తున్నారు మమతా బెనర్జీ. యూపీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీకి మద్దతిచ్చిన మమతా.. అక్కడి ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నారు. కేసీఆర్‌ కూడా ఎస్పీ గెలవాలనే కోరుకుంటున్నారు. దేశ రాజకీయాలకు ఉత్తర ప్రదేశ్‌ కీలకం కావడంతో.. అక్కడ బీజేపీకి దెబ్బపడితే చాలన్నది ప్రాంతీయ పార్టీల ఆలోచన.

అటు కేజ్రీవాల్‌ కూడా మంచి దూకుడు మీద ఉన్నారు. ఇప్పటికే ఢిల్లీ నుంచి గోవాకు వయా పంజాబ్‌ పయనిస్తున్నారు. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఆమ్‌ఆద్మీ పార్టీ బలం పెరిగితే.. ఆటోమేటిక్‌గా ప్రాంతీయ పార్టీల బలం కూడా పెరుగుతుంది. మమత, అఖిలేశ్, కేజ్రీవాల్, కేసీఆర్, స్టాలిన్.. వీళ్లంతా ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమవ్వాలని కోరుకుంటున్నారు.

బీజేపీయేతర, కాంగ్రెస్సేతర కూటమి ఉండాల్సిందేనన్నది ప్రాంతీయ పార్టీల టార్గెట్‌గా కనిపిస్తోంది. అందుకే, థర్డ్‌ ఫ్రంట్ లేదా ఫెడరల్ ఫ్రంట్‌ ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. లేదంటే తానే కొత్త జాతీయ పార్టీ పెడతానంటూ ఓ అడుగు ముందుకు వేశారు కేసీఆర్. ఏదైనా యూపీ ఎన్నికల ఫలితాలను బట్టే ప్రాంతీయ పార్టీల దూకుడు ఎలా ఉంటుందన్నది తేలిపోతుంది.

Tags

Read MoreRead Less
Next Story