Omicron India: తెలంగాణలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసుల సంఖ్య.. ముఖ్యంగా ఆ ప్రాంతంలో..

Omicron India: తెలంగాణలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసుల సంఖ్య.. ముఖ్యంగా ఆ ప్రాంతంలో..
Omicron India: తెలంగాణలో కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్ కేసులు దడ పుట్టిస్తున్నాయి.

Omicron India: తెలంగాణలో కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్ కేసులు దడ పుట్టిస్తున్నాయి. మొదటి ఒమిక్రాన్ కేసు బయటపడ్డ టోలిచౌకి పారామౌంట్‌ కాలనీ ఇప్పుడు హాట్‌స్పాట్‌గా మారిందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఈ ప్రాంతంలో టెస్టింగ్‌, ట్రేసింగ్ చేస్తున్నాయి వైద్య బృందాలు. కాంటాక్టుల్లోనూ ఓమిక్రాన్ పాజిటివ్‌ కేసులు బయటపడుతుండడంతో ఆందోళన కలిగిస్తోంది.

శాంపిల్స్ సేకరించడం.. పాజిటివ్‌ వచ్చిన వారి శాంపిల్స్ జీనోమ్‌ సీక్వెన్స్‌ పంపించడం తర్వాత ఫలితాలు రావడానికి టైం పడుతోంది. ఇంకా అక్కడ ఎన్ని కేసులు పెరుగుతాయోనని స్థానికులు టెన్షన్ పడుతున్నారు. పారామౌంట్ కాలనీ పక్కనే ఉన్న బంజారాహిల్స్‌, శేరిలింగంపల్లి, నల్లగండ్లకు ఒమిక్రాన్‌ వ్యాపించింది. శనివారం ఒక్కరోజే తెలంగాణలో 12 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.

ఇందులో పది మంది రిస్క్‌ జాబితాలో లేని దేశాల నుంచి వచ్చిన వారే ఉన్నారు. 12 మందిలో 9 మంది విదేశీయులు కాగా..ముగ్గురు భారతీయులని అధికారులు చెప్పారు. కెన్యా నుంచి వచ్చిన ఆరుగురికి ఒమిక్రాన్‌ వేరియంట్‌ను గుర్తించగా.. సోమాలియా, యూఏఈ నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులు.. ఘనా, టాంజానియా నుంచి వచ్చిన ఒక్కొక్కరిలో ఒమిక్రాన్‌ను నిర్ధారించారు.

దీంతో రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 20కి చేరింది. శనివారం మరో 315 మంది ప్రయాణికులకు పరీక్షలు నిర్వహించగా..ముగ్గురికి కరోనా పాజిటివ్‌గా తేలింది. వీరి శాంపిల్స్ జీనోమ్‌ సీక్వెన్స్‌ కోసం పంపారు. రిస్క్‌ లేని దేశాల నుంచి వస్తున్న ప్రయాణికులకు ర్యాండమ్‌గా టెస్టులు చేస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకోని, ఒక్క డోసు మాత్రమే తీసుకున్న వారిని సెలక్ట్ చేసి పరీక్షలు చేస్తున్నారు.

తక్కువ మందికే టెస్టులు నిర్వహిస్తున్నా.. భారీగా కేసులు వస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. యూకే నుంచి ఇటీవల హన్మకొండకు వచ్చిన మహిళకు మొదట నెగెటివ్‌ వచ్చినా.. వారం రోజుల తర్వాత పాజిటివ్‌గా తేలింది. ఇప్పటివరకూ ఒమిక్రాన్‌ పాజిటివ్‌గా తేలిన 20 మందిలో 16 మంది నాన్‌ రిస్క్‌ దేశాలకు చెందిన వారే ఉన్నారు.

టెస్టుల టైంలో చాలా మంది తప్పుడు అడ్రస్‌, మొబైల్‌ నంబర్‌ ఇస్తున్నారు. పాస్‌పోర్టుల్లో అడ్రస్‌ అప్డేట్‌ చేయకపోవడంతో వీరిని గుర్తించడం కష్టంగా మారింది. దీంతో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ర్యాండమ్‌గా కాకుండా అందరికి పరీక్షలు చేస్తేనే ముప్పు తగ్గుతుందని కేంద్ర వైద్య,ఆరోగ్య శాఖకు లేఖ రాసింది తెలంగాణ ప్రభుత్వం.

Tags

Read MoreRead Less
Next Story