Telangana : తెలంగాణ నెంబర్‌ ప్లేట్లలో ఇక టీజీ

Telangana : తెలంగాణ నెంబర్‌ ప్లేట్లలో ఇక   టీజీ
కొత్తగా జరిగే వాహన రిజిస్ట్రేషన్లకు మాత్రమే

పదేళ్ల తర్వాత రాష్ట్రంలోని కొత్త వాహనాల నంబర్‌ ప్లేట్లలో మార్పు రాబోతుంది. TSస్థానంలో TG మార్చుతూ కేంద్ర ఉపరితల రవాణా శాఖ గెజిట్‌ జారీ చేసింది. రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ సర్కార్‌...వాహనాల నంబర్‌ప్లేట్లలో మార్పులు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర సర్కారు అభ్యర్థనను కేంద్రం పరిగణలోకి తీసుకోవడంతో కొత్తగా రిజిస్ట్రేషన్ వాహనాలన్నీ TG పేరుతో రోడ్లెక్కబోతున్నాయి.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాహన రిజిస్ట్రేషన్‌ మార్కులో మార్పు చేయాలని నిర్ణయించింది. ఫిబ్రవరిలో రాష్ట్ర మంత్రివర్గంలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపింది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు వాహనాల నంబర్ ప్లేట్లలో TS స్థానంలో TGని మార్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఈనెల 12న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. మోటారు వాహనాల చట్టం-1988లోని సెక్షన్ 41 (6) కింద ఉన్న అధికారాలను ఉపయోగించి కేంద్ర ప్రభుత్వం మార్పు చేసింది. గత నోటిఫికేషన్‌లోని టేబుల్లో సీరియల్ నంబర్ 29ఏ కింద తెలంగాణకు ఇదివరకు ఉన్న TS స్థానంలో TGమార్క్ కేటాయించినట్లు కేంద్రం వెల్లడించింది.

రాష్ట్రంలో మొత్తం కోటీ 60లక్షల పైచిలుకు వాహనాలు ఉన్నాయి. అందులో కోటీ 18లక్షల ద్విచక్రవాహనాలు, 21లక్షల 32వేల కార్లు, 7లక్షల 27వేల ట్రాక్టర్లు-ట్రైలర్లు, 6లక్షల 18వేల రవాణా వాహనాలు తదితరాలు ఉన్నాయి. ఇప్పటికే నడుపుతున్న వాహనాల నంబర్ ప్లేట్లలో ఎలాంటి మార్పు చేసుకోవాల్సిన అవసరం లేదని రవాణాశాఖ అధికారులు తెలిపారు. AP పేరుతో రిజిస్ట్రేషన్‌ అయిన వాహనాలు రాష్ట్రంలో ఇంకా భారీ సంఖ్యలోనే తిరుగుతున్నాయి. తెలంగాణ ఏర్పాటైన నాటి నుంచి TS పేరిట రిజిస్ట్రేషన్‌ అవుతూ వస్తుండగా...తాజాగా ప్రభుత్వ నిర్ణయంతో TG పేరుతో రిజిస్ట్రేషన్‌ కానున్నాయి. పాత వాహనాలకు TS పేరు మీదే కొనసాగుతాయని... మోటారు వాహన యూనియన్ నేతలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రవాణా శాఖ అధికారులు భరోసానిస్తున్నారు. కేంద్రం గెజిట్‌ జారీ చేసిన రోజు తర్వాత కొన్న కొత్త వాహనాలకే TGగా మార్పు చేసిన నంబర్‌ప్లేట్లను కేటాయించినట్లు రవాణా శాఖ అధికారులు తెలిపారు

Tags

Read MoreRead Less
Next Story