కరోనా నిబంధనలు గాలికి వదిలేసిన జనం

కరోనా నిబంధనలు గాలికి వదిలేసిన జనం
మాస్క్ లేకుండా బయట తిరగడం.. భౌతిక దూరం పాటించకపోవడం చాలా ప్రమాదకరమంటున్నారు తెలంగాణ పబ్లిక్‌ హెల్త్‌ డైరెక్టర్‌

కరోనా ముప్పు తొలగలేదు. ఆ మహమ్మారి చాప కింద నీరులా మళ్లీ విస్తరిస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ప్రతాపం చూపిస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్.. నైట్ కర్ఫ్యూ కూడా అమలు చేస్తున్నారు. పొరుగు రాష్ట్రాల్లో వైరస్‌ విజృంభిస్తుండంతో.. తెలంగాణ సర్కార్ అప్రమత్తమయ్యింది.

ఐతే.. జనం ప్రభుత్వ నిబంధనలు గాలికి వదిలేస్తున్నారు. ప్రతి ఒక్కరు ముఖానికి మాస్క్‌ పెట్టుకోవడం తప్పనిసరి.. తరచూ చేతుల్ని శానిటైజ్‌ చేసుకోవడమూ ముఖ్యమే.. ఇంట్లో ఉన్నా.. బయటి కెళ్లినా భౌతిక దూరం పాటించడం అత్యంత ఆవశ్యకం. ఇవే అంశాల్ని ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేస్తోంది. కానీ.. జనం అవేవీ పట్టించుకోవడం లేదు. మాస్క్‌ పెట్టుకోకుండా ఇష్టానుసారం రోడ్లపై తిరుగుతున్నారు. భౌతిక దూరం అన్న మాటే లేదు. ఇలానే చేస్తే.. వైరస్ స్వైర విహారం చేయడం ఖాయమంటోంది వైద్య శాఖ.

మాస్క్ లేకుండా బయట తిరగడం.. భౌతిక దూరం పాటించకపోవడం చాలా ప్రమాదకరమంటున్నారు తెలంగాణ పబ్లిక్‌ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు. వ్యాక్సిన్‌ వచ్చినా.. కరోనా జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి అంటున్నారు.

గ్రామీణ ప్రాంతాలకు చెందిన వలస కూలీలు ఉపాధి కోసం పట్టణానికి రావడం.. గుంపులు, గుంపులుగా ఒకే దగ్గర చేరి కూలీ పనులు చేస్తుండటంతో కరోనా మళ్లీ పుంజుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. రోజురోజుకూ జనాలు కరోనా నిబంధనలు పాటించకుండా ఉంటే.. వైరస్ మరింత విజృంభించే అవకాశం ఉందని వైద్యాధికారులు భావిస్తున్నారు.

కరోనా మళ్లీ కాటేయకుండా ఉండాలంటే.. అది జనం ప్రవర్తించే తీరుపైనే ఉంటుంది. మాస్క్‌..శానిటైజర్..భౌతిక దూరమే వైరస్‌ దరి చేయకుండా ఉంచే ఆయుధాలు. అందుకే నిబంధనలు పాటిస్తూ.. బాధ్యతగా ఉండడమే కరోనా ముప్పు నుంచి తప్పించుకునే మార్గం.


Tags

Read MoreRead Less
Next Story