Phone Tapping Case: కొనసాగుతున్న రాధాకిషన్‌రావు విచారణ

Phone Tapping Case: కొనసాగుతున్న రాధాకిషన్‌రావు విచారణ
భిన్న కోణాల్లో పోలీసుల విచారణ

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో నిందితుడైన టాస్క్‌ఫోర్స్‌ మాజీ DCP రాధాకిషన్‌రావును.. తొలిరోజు కస్టడిలో పోలీసులు కీలక విషయాలపై ప్రశ్నించారు.రిమాండ్‌ రిపోర్ట్‌లోని అంశాలపైనే ప్రధానంగా దృష్టి పెట్టినట్లు సమాచారం. ఎవరి ఆదేశాల మేరకు అనధికారిక కార్యకలాపాలు నిర్వహించారు..? హార్డ్‌ డిస్క్‌లను ఎందుకు ధ్వంసం చేశారని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈనెల పదో తేదీ వరకు రాధాకిషన్‌రావును పోలీసులు విచారించనున్నారు.

రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా మారిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో... పోలీసుల విచారణ జోరుగా సాగుతోంది. ఈ కేసులో కీలక నిందితుడైన హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ మాజీ DCP రాధాకిషన్‌రావును కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకున్నారు. చంచల్‌గూడ జైలు నుంచి ఉస్మానియా ఆసుపత్రికి తరలించి... వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం.. బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చారు. రాధాకిషన్‌రావు రిమాండ్‌ రిపోర్ట్‌లో పేర్కొన్న కీలాకాంశాలపైనే తొలిరోజు ప్రశ్నించినట్లు సమాచారం. ఫోన్‌ ట్యాపింగ్‌ సమాచారం ద్వారా.. పలువురి వద్ద నుంచి సీజ్‌ చేసిన నగదు ఏం చేశారు..? ఎవరి ఆదేశాల మేరకు నగదు సీజ్‌ చేశారు..? ఎవరెవరి వద్ద నగదు పట్టుకున్నారనే...? కోణాల్లో పోలీసులు రాధాకిషన్‌రావుపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది.

టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావునుఈనెల 10 తేదీ వరకు విచారించనున్నట్టు పశ్చిమ మండలం డీసీపీ విజయ్‌కుమార్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. హార్డ్‌ డిస్క్‌లను ధ్వంసం చేయడంలో ఆయన పాత్ర ఉందని ఆరోపణలు వచ్చాయనిnఆ దిశగా ప్రశ్నిస్తున్నట్టు తెలిపారు. S.I.Bలో చట్టవిరుద్ధంగా ప్రైవేట్ వ్యక్తుల ప్రొఫైల్‌లను రూపొందించడం, ఓ రాజకీయ పార్టీకి అనుకూలంగా పక్షపాత ధోరణిలో వ్యవహరించడం వంటి విషయాలపై సమాచారం రాబడుతున్నామని DCP విజయ్‌కుమార్‌ వివరించారు. కస్టడీలో రాధాకృష్ణరావు వెల్లడించే అంశాల ఆధారంగా మరి కొంతమందికి నోటీసులు ఇచ్చి విచారించాలని పోలీసులు భావిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story