PM Telangana Tour : అక్టోబర్ 2న తెలంగాణకు మోదీ..

PM Telangana Tour : అక్టోబర్ 2న తెలంగాణకు మోదీ..
దూకుడు పెంచనున్న బీజేపీ

రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా ముందుకెళ్తున్న భాజపా ప్రధాని నరేంద్రమోదీనే ఎన్నికల ప్రచారంలోకి దింపుతోంది. వచ్చేనెల 2న మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌లో ప్రధానిమోదీతో భారీబహిరంగ సభలు నిర్వహించేందుకు సన్నద్ధమైంది. ఆతర్వాత అమిత్‌షా, JP నడ్డా ఇతర కీలక నేతలతో సభలు నిర్వహిస్తూ.. రాజకీయ వేడి పుట్టించేందుకు ప్రణాళికా బద్ధంగా ముందుకు వెళ్తోంది.

శాసనసభ ఎన్నికల కార్యాచరణను బహుముఖ వ్యూహంతో ముందుకు తీసుకెళ్లాలని రాష్ట్ర భాజపా నిర్ణయించింది. క్షేత్రస్థాయి కీలక కార్యాచరణకి నెలాఖరులోపు తుదిరూపు ఇచ్చి అక్టోబరు తొలివారంలో ప్రధాని మోదీసహా అగ్రనేతల సభలు, అభ్యర్థుల ప్రకటనకు సిద్ధమైంది అక్టోబరు 2న ప్రధాని నరేంద్రమోదీ మహబూబ్‌నగర్, నిజామాబాద్‌లలో నిర్వహించనున్న బహిరంగసభల్లో పాల్గొననున్నారు. అనంతరం అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, భాజపా జాతీయ అధ్యక్షుడు JP నడ్డాలతోనూ బహిరంగ సభలు ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. అమిత్‌షా, JPనడ్డాల సభలను. రాష్ట్రంలో మరో రెండు ఉమ్మడి జిల్లాల్లో చేపడతారు. లోక్‌సభ సమావేశాలు ముగిసినందున భాజపా రాష్ట్రనేతలతో కిషన్‌రెడ్డి సమావేశమై ఎన్నికల కార్యాచరణ ఖరారుచేస్తారని నేతలు తెలిపారు. ఈనెల 26 నుంచి అక్టోబరు 2 వరకు 119 నియోజవర్గాల్లోనిnమూడుమార్గాల్లో బస్సుయాత్ర చేపట్టాలని పార్టీ తొలుత నిర్ణయించింది. ప్రస్తుతానికి వాటిని వాయిదా వేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. బస్సుయాత్ర స్థానంలో ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌లో మూడు, నాలుగు సభలు జరపాలని నిర్ణయించారు. ఆ సభల తేదీలు ఒకట్రెండు రోజుల్లో ఖరారు చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి సభలు ప్రారంభించాలని భావిస్తున్నారు.


అసెంబ్లీకి పోటీచేసే అభ్యర్థుల జాబితాను అక్టోబరు తొలివారంలో ప్రకటించేందుకు భాజపా సిద్ధమైంది. నియోజకవర్గానికి ముగ్గురు లేదా నలుగురి పేర్లు గుర్తించి........ సర్వేలు, పార్టీనేతల అభిప్రాయాలు, వివిధ సమీకరణాలు పరిగణనలోకి తీసుకుని ఎంపిక చేస్తారని పార్టీ నేతలు తెలిపారు. ముఖ్యనేతలంతా శాసనసభ ఎన్నికల బరిలో నిలవాల్సి ఉంటుందని పార్టీ జాతీయ నాయకత్వం సంకేతాలిచ్చింది. ఈ నేపథ్యంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సహా కీలక నేతలంతా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలవడం ఖాయమని తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో బూత్‌ల వారీగా ఎన్నికల సంసిద్ధత కార్యాచరణను....... ఈ నెల 29లోగా పూర్తి చేయనున్నారు. ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం నియమించిన నాయకులు నియోజకవర్గాల వారీగా అసెంబ్లీ సెగ్మెంట్లలోని బూత్‌లలో సంసిద్ధత సమీక్షిస్తున్నారు. బూత్‌, మండల కమిటీలతో సమావేశమై ఎన్నికలకు ఎంతమేరకు సిద్ధంగా ఉన్నారనే అంశాలు పరిశీలిస్తున్నారు. సమస్యలుంటే పరిష్కరించడంపై దృష్టిపెట్టారు. రాష్ట్ర కమిటీకి సెగ్మెంట్ల వారీగా నియోజకవర్గ ఇన్‌ఛార్జులు నివేదిక ఇవ్వనున్నారు .ఎన్నికల రోడ్‌మ్యాప్‌ను సంసిద్ధంచేయడంలో అది ఉపయోగపడుతుందని పార్టీనేతలు చెబుతున్నారు. అధికార భారాస, కాంగ్రెస్‌కి ధీటుగా భాజపా తనదైన వ్యూహాలతో ముందుకెళ్తోంది.

Tags

Read MoreRead Less
Next Story