MODI: నేడు తెలంగాణకు ప్రధాని మోదీ

MODI: నేడు తెలంగాణకు ప్రధాని మోదీ
ఎన్నికల శంఖారావం పూరించనున్న బీజేపీ... మోదీ ప్రసంగంపై ఆసక్తి

తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పేలవమైన పాలన పట్ల జనం విరక్తితో ఉన్నారని ప్రధాని మోదీ విమర్శించారు. కాంగ్రెస్‌ పట్ల కూడా అదేవిధమైన అభిప్రాయంతో ఉన్నారన్నారు. ఆ రెండు కుటుంబ పార్టీలు ప్రజలను అసలు పట్టించుకోవని ఆరోపించారు. నేడు ప్రధాని మోదీ తెలంగాణకు రానున్నారు. మధ్యాహ్నం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్న మోదీ అక్కడి నుంచి నేరుగా హెలికాప్టర్‌లో మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూరు పురపాలిక పరిధిలో అమిస్తాపూర్ శివారులో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడ నిర్వహించే పాలమూరు ప్రజాగర్జన సభలో మోదీ పాల్గొననున్నారు.

కేంద్రం చేపట్టిన 13 వేల 500 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి జాతికి అంకితమివ్వనున్నారు. మోదీ రాకతో తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి భారతీయ జనతా పార్టీ నేటి నుంచి శ్రీకారం చుట్టనుంది. మహబూబ్‌నగర్ జిల్లా అమిస్తాపూర్‌లో నిర్వహించే పాలమూరు ప్రజాగర్జన బహిరంగ సభ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు.


moKCR పాలనా వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టడం, పదేళ్ల మోదీ హయాంలో భాజపా తెలంగాణకు ఏం చేసిందో, అధికారంలోకి వస్తే ఏం చేయబోతోందో ప్రస్తావించే అవకాశం ఉంది. పాలమూరులో నిర్వహించే అధికారిక కార్యక్రమాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలతో పాటు ప్రారంభోత్సవాలుచేసి జాతికి అంకితం చేయనున్నారు.

వరంగల్ - ఖమ్మం, ఖమ్మం - విజయవాడ నాలుగు వరుసల రహదారి పనులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. 1,932 కోట్ల రూపాయలతో కృష్ణపట్నం - హైదరాబాద్‌ మధ్య మల్టీ ప్రోడక్ట్‌ పైప్‌లైన్‌కు శంకుస్థాపన చేస్తారు. 2 వేల 457 కోట్లతో నిర్మించిన సూర్యాపేట - ఖమ్మం నాలుగు వరుసల రహదారిని మహబూబ్‌నగర్ నుంచే ప్రారంభిస్తారు. 505 కోట్లతో నిర్మించిన జక్లేర్‌ - కృష్ణా కొత్త రైల్వే మార్గాన్ని ప్రధాని జాతికి అంకితం చేస్తారు. కృష్ణా స్టేషన్‌ నుంచి కాచిగూడ డెమూను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపి ప్రారంభిస్తారు. 2 వేల 661 కోట్ల విలువైన హసన్‌- చర్లపల్లి HPCL LPG పైప్‌లైన్‌ను జాతికి అంకితమిస్తారు. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో 81.27 కోట్లతో నిర్మించిన భవనాల్ని వర్చువల్‌గా ప్రారంభిస్తారు.

Tags

Read MoreRead Less
Next Story