పీఆర్సీపై నేడు కేసీఆర్‌కు చేరనున్న సోమేశ్‌ కమిటీ ఫైనల్‌ నోట్‌

పీఆర్సీపై నేడు కేసీఆర్‌కు చేరనున్న సోమేశ్‌ కమిటీ ఫైనల్‌ నోట్‌
పీఆర్సీపై సోమేశ్‌ కమిటీ ఫైనల్‌ నోట్‌ సీఎం కేసీఆర్‌కు సమర్పించనుంది. ఈ నోట్‌ ఎలా ఉంటుందనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది.

వేతన సవరణపై బిశ్వాల్‌ కమిటీ ఇచ్చిన నివేదికను ఉద్యోగ సంఘాలు ముక్తకంఠంతో తిరస్కరించాయి. సీఎస్‌ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ ఎదుట చర్చలకు హాజరైన సంఘాల ప్రతినిధులు నివేదికలోని సిఫారసులపై అభ్యంతరాలు తెలిపారు. బీఆర్‌కే భవన్‌లో మూడు రోజుల పాటు జరిగిన చర్చలు ముగిసాయి. త్రిసభ్య కమిటీ మొత్తం 14 సంఘాలతో చర్చలు జరపగా.. చివరి రోజు 6 సంఘాల ప్రతినిధులు కమిటీ ఎదుట తమ అభిప్రాయాలు తెలిపారు. ఉద్యోగుల సమస్యలు తీర్చే విధంగా కమిటీ రిపోర్ట్ లేదని.. డిమాండ్లపై వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారు. బిశ్వాల్ కమిటీ వల్ల కాలయాపనతో పాటు కోట్ల రూపాయలు ఖర్చు అయ్యాయే తప్ప.. ఎలాంటి ఉపయోగం లేదని సంఘాల ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తంచేశారు.

కమిటీ ఎదుట ఉద్యోగ సంఘాల నేతలు ఫిట్‌మెంట్‌పై తమ అభిప్రాయాల్ని బలంగా వినిపించారు. గతంలో 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చినందున.. ఈ సారి అందుకు తగ్గకుండా ఇవ్వాలని కోరారు. కనీస వేతనం 24000 గా ఉండాలని.. 2018 జూలై 1 నుంచి కొత్త పీఆర్సీ ప్రయోజనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖతో పాటు అన్ని విభాగాల్లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కనీస మూల వేతనం ఇవ్వాలని, రెగ్యులర్ నియామకాలు చేపట్టాలని, సీపీఎస్‌ పాత విధానం అమలు జరిగేలా చూడాలన్నారు. 60 ఏళ్ల వయో పరిమితిని ఈ నెల నుంచే అమలు చేయాలని కోరారు.

ఐతే.. ఆర్థిక మాంద్య ప్రభావంతో పాటు కరోనా ప్రభావంతో ఆర్థిక ఇబ్బందులు నెలకొన్నాయన్నారు త్రిసభ్య కమిటీ సభ్యులు. చర్చల సందర్భంగా ఉద్యోగ సంఘాల నేతలకు పలు సూచనలు చేశారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా బిశ్వాల్‌ కమిటీ సిఫారసులు ఉన్నాయని.. రానున్న రోజుల్లో ప్రభుత్వం మరిన్ని ప్రయోజనాలు కల్పిస్తుందని చెప్పారు. అటు..సీఎం కేసీఆర్‌ను నేరుగా కలుస్తామని ఉద్యోగ సంఘాల నేతలు త్రిసభ్య కమిటీకి తెలిపారు.

మూడు రోజుల పాటు జరిగిన చర్చల్లో త్రిసభ్య కమిటీ 14 గుర్తింపు పొందిన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలు తీసుకుంది. అయితే మొత్తం 78 అనుబంధ సంఘాలు ఉన్నాయని, అందరితోనూ చర్చలు జరపాలని ఉద్యోగుల ఐక్య వేదిక కోరుతోంది. ఇక చర్చలు లేవని చెబుతున్నారు కాబట్టి.. ఉద్యోగ సంఘాలు ఇచ్చిన అభ్యంతరాలు, సలహాలు, సూచనల్ని క్రోడీకరించి పీఆర్సీపై సోమేశ్‌ కమిటీ ఫైనల్‌ నోట్‌ సీఎం కేసీఆర్‌కు సమర్పించనుంది. ఐతే.. ఈ నోట్‌ ఎలా ఉంటుందనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Tags

Read MoreRead Less
Next Story