పెండింగ్ లో ఉన్న 17 సీబీఐ కేసులను 9 నెలల్లో తేల్చాలని ప్రతిపాదన..

పెండింగ్ లో ఉన్న 17 సీబీఐ కేసులను 9 నెలల్లో తేల్చాలని ప్రతిపాదన..
రోజు రోజుకు పెరిగిపోతున్న రాజకీయ నేతల కేసులపై విచారణకు దేశంలోని అన్ని హైకోర్టులు తమ ప్రణాళికలు సిద్దం చేశాయి. ఈమేరకు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది..

రోజు రోజుకు పెరిగిపోతున్న రాజకీయ నేతల కేసులపై విచారణకు దేశంలోని అన్ని హైకోర్టులు తమ ప్రణాళికలు సిద్దం చేశాయి. ఈమేరకు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, అమికస్ క్యూరీ విజయ్ హన్సారియ సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించారు. సుప్రీంకోర్టు సూచనల మేరకు ప్రజా ప్రతినిధుల కేసుల్లో అనుసరించాల్సిన కార్యాచరణను ఆయన కోర్టుకు సూచిస్తూ నివేదిక సమర్పించారు. ఇందులో సుప్రీంకోర్టుకు సమర్పించిన అన్ని కార్యాచరణ ప్రణాళికలను అన్ని హైకోర్టులు అమలు చేసేవిధంగా ఆదేశించాలి సూచించారు. ఇందుకోసం ప్రత్యేక నోడల్ ప్రాసిక్యూషన్ అధికారులను, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లను అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నియమించాలని వెల్లడించారు. ప్రజా ప్రతినిధులపై పెండింగ్‌లో ఉన్న కేసుల వేగవంతానికి వీరు కృషిచేయాలని ఈ నివేదికలో పేర్కొన్నారు.

అమికస్ క్యూరీ విజయ హన్సారియా నివేదిక మేరకు దేశంలోని అన్ని హైకోర్టులు కేసుల విచారణకు సంసిద్దత వ్యక్తం చేశాయి. ప్రస్తుత, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న ఆర్థిక నేరాలు, క్రిమినల్‌ నేరాల కేసుల సత్వర విచారణకు ఆయా హైకోర్టులు కార్యాచరణను ప్రకటించాయి. తెలంగాణలో ప్రిన్సిపల్‌ సీబీఐ కోర్టు ముందు పెండింగ్‌ లో ఉన్న 17 కేసులను 9 నెలల్లోనే తేల్చాలని తెలంగాణ హైకోర్టు ప్రతిపాదించింది. ఇందులో 16 కేసులు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ తదితరులు ఎదుర్కొంటున్నారు. ఆర్థిక అక్రమాలకు సంబంధించి జగన్‌పై సీబీఐ దాఖలు చేసిన 11 చార్జిషీట్లు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నమోదు చేసిన 5 అభియోగ పత్రాలు హైదరాబాద్‌లోని ప్రిన్సిపల్‌ సీబీఐ కోర్టులోనే ఉన్నాయి.

రాజకీయ నేతలపై పెండింగ్‌లో ఉన్న కేసుల విచారణకు తెలంగాణలోని అన్ని కోర్టుల్లో 15 రోజులకోసారి సమీక్షించి, వేగంగా పరిష్కరించే దిశగా తగిన ఆదేశాలు జారీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులను ప్రత్యేకంగా ప్రతి శనివారం చేపట్టి, అవసరమైన చోటల్లా సీనియర్‌ క్రిమినల్‌ న్యాయవాదులను నియమించాలని ప్రతిపాదించారు. సుప్రీం కోర్టుఆదేశాల మేరకు జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఇవాళ మరోసారి విచారణ చేపట్టనుంది. సిటింగ్‌, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలపై ఆంధ్రప్రదేశ్‌లో 131, తెలంగాణలో 143 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. దేశవ్యాప్తంగా నేతలపై ఈ ఏడాది మార్చిలో 4442 కేసులు ఉండగా.. ఇప్పుడు ఆ సంఖ్య 4859కి పెరిగింది. ఇందులో 1374 ఉత్తరప్రదేశ్‌ చెందిన నేతలవే.

తెలంగాణ వ్యాప్తంగా నేతలపై ఉన్న కేసుల విచారణ దశతోపాటు, పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలతో ప్రత్యేక వెబ్‌సైట్‌ ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని హైకోర్టు తెలిపింది. పెండింగ్‌లో ఉన్న అన్ని సమన్లు, వారెంట్లను ఇచ్చేలా చూస్తామన్నది. నిందితులకు సమన్లు జారీ చేయడం, నాన్‌ బెయిలబుల్‌ వారెంట్లను అమలు చేయడం వంటి బాధ్యతలను నోడల్‌ అధికారిగా అదనపు ఎస్పీ ర్యాంకు అధికారికి అప్పగిస్తామని తెలిపింది. దీనిలో భాగంగా కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌లో ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు హైకోర్టు అంగీకరించింది.

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ ప్రత్యేక కోర్టులో ఎంపీలు, ఎమ్మెల్యేలపై 132 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. నేతలపై కేసుల సత్వర పరిష్కారానికి ప్రతి జిల్లాలో ఒక మెజిస్ట్రేట్‌ను ప్రత్యేక కోర్టుగా నియమిస్తామని ఏపీ హైకోర్టు తెలిపింది. విశాఖ, కడపలో మరో రెండు ప్రత్యేక కోర్టులను సెషన్స్‌ స్థాయిలో నియమిస్తామని వివరించింది. దీనితోపాటు కర్ణాటక, కోల్‌కతాలోని హైకోర్టులు మాత్రం రాష్ట్ర రాజధానుల్లోనే ప్రత్యేక కోర్టులు ఉండాలని తెలిపాయి.

Tags

Read MoreRead Less
Next Story