RAHUL: తెలంగాణలో కాంగ్రెస్ సునామీ: రాహుల్‌గాంధీ

RAHUL: తెలంగాణలో కాంగ్రెస్ సునామీ: రాహుల్‌గాంధీ
బీజేపీ, ఎంఐఎం, బీఆర్‌ఎస్‌ ఒక్కటే... రాహుల్‌కు జన నీరాజనం..

తెలంగాణలో కాంగ్రెస్‌ సునామీ రాబోతుందని కాంగ్రెస్ నేత రాహుల్‌ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌, ఎంఐఎంకలిసే ఉన్నాయన్న ఆయన అందుకే కేసీఆర్‌ కుటుంబంపై కేంద్ర దర్యాప్తు సంస్థలు చర్యలు తీసుకోవంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణలో భారాస ఒంటరి పార్టీ కాదని బీజేపీ, ఎంఐఎం వారితో కలిసే ఉంటాయని రాహుల్‌గాంధీ విమర్శించారు. రెండో రోజు యాత్రలో భాగంగా పెద్దపల్లి జిల్లాలో పర్యటించిన ఆయన ఆ తర్వాత కరీంనగర్‌లో పాదయాత్ర నిర్వహించారు. మారుతి నగర్ చౌరస్తా నుంచి పలు వీధుల గుండా రాజీవ్‌చౌక్ వరకు పార్టీ కార్యకర్తలతో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. పెద్దఎత్తున కార్యకర్తలు అభిమానులు ర్యాలీలో పాల్గొన్నారు. దాబాలపై నుంచి అభిమానులు రాహుల్ గాంధీ పై పూల వర్షాన్ని కురిపించారు.


రాజీవ్‌చౌక్ కార్నర్ మీటింగ్‌లో ప్రసంగించిన రాహుల్‌ గాంధీ బీజేపీకు వ్యతిరేకంగా పోరాడుతుడటం వల్లే ఎన్నో కేసులు పెట్టారని ఆరోపించారు. లోక్‌సభ సభ్యత్వంతోపాటు తన ఇంటిని లాకున్నారని వ్యాఖ్యానించారు. ఎంఐఎం దేశవ్యాప్తంగా ఎన్నికల్లో పాల్గొని ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి బీజేపీకి సహాయ పడుతోందన్నారు. బీజేపీకి ముఖ్యమంత్రి కేసీఆర్‌ మద్దతు ఇస్తున్నారని అందుకే ఆయన వెంట సీబీఐ, ఈడీలు వెంటపడవన్నారు. ఆ రెండు పార్టీలకు లోపాయికారి ఒప్పందాలు ఉన్నాయని రాహుల్ ఆరోపించారు. తెలంగాణలో ప్రజా పాలన ఏర్పడటం ఖాయమన్న ఆయన... అధికారంలోకి రాగానే కులగణన తీయించే పని చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు అధికారంలోకి తీసుకొస్తే ఢిల్లీలో సిపాయిలాగా పనిచేస్తానని రాహుల్‌గాంధీ భరోసా కల్పించారు. రాహుల్ గాంధీ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తొలి సమావేశంలో ఆరు గ్యారెంటీలను అమలుచేస్తామని హామీఇచ్చారు. కర్ణాటకలో అనుసరిస్తున్న విధానాలను తెలుసుకోవచ్చని సూచించారు. పెద్దపల్లిలో నిర్వహించిన బహిరంగ సభ వేదికగా సీఎం కేసీఆర్, ప్రధాని మోదీపై రాహుల్ విరుచుకుపడ్డారు.

మూడోరోజైన ఇవాళ రాహుల్‌గాంధీ గంగాధర, కొండగట్టు ,జగిత్యాల మీదుగా కోరుట్ల వరకు విజయభేరి బస్సుయాత్ర కొనసాగించనున్నారు. ఆర్మూర్ సభ అనంతరం ఆయన డిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీలో ఓ అత్యవసర సమావేశానికి హాజరు కావాల్సి ఉన్నందున నిజామాబాద్‌లో సాయంత్రం నిర్వహించనున్న పాదయాత్రను రద్దు చేసినట్లు కాంగ్రెస్ తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story