Top

తెలంగాణలో భారీ వర్షాలు .. ఆందోళనలో రైతులు

తెలంగాణలో భారీ వర్షాలు .. ఆందోళనలో రైతులు
X

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండ్రోజుల నుంచి హైదరాబాద్‌లో ఉరుములు మెరుపులతో కుండపోత వాన కురుస్తూనే ఉంది. మియాపూర్‌ నుంచి వనస్థలిపురం వరకు.. ఉప్పల్‌ నుంచి ఇటు గచ్చిబౌలి వరకు వర్షం ఆగలేదు. రాబోయే 72 గంట‌ల్లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం హెచ్చరించడంతో జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. అధికారులు, డీఆర్ఎఫ్ బృందాలు అలెర్ట్‌గా ఉండాల‌ని జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ లోకేశ్ కుమార్ ఆదేశించారు. న‌గ‌రంలోని కొన్ని ప్రాంతాల్లో 9 నుంచి 16 సెంటిమీట‌ర్ల వ‌ర్షపాతం కురిసే అవ‌కాశం ఉన్నందున ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

ఇక రాష్ట్రవ్యాప్తంగా మెదక్‌, సిద్దిపేట, గద్వాల జోగులాంబ, వనపర్తి, వికారాబాద్‌, సంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, జగిత్యాల, ఆదిలాబాద్‌ జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. రంగారెడ్డి, నిజామాబాద్‌, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, మంచిర్యాల, వరంగల్‌ అర్బల్‌, రూరల్‌, కొత్తగూడెం సహా పలు జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి. కుండపోత వానలకు వందల ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. చేతికందే సమయంలో పంటలు నీటమునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

నల్లగొండ, నాగర్‌ కర్నూలు జిల్లాల సరిహద్దుల్లో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇప్పటికే డిండి ప్రాజెక్ట్‌ పూర్తి జలకళ సంతరించుకుంది. దీంతో పాటు పెద్దవాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. కందుకూరు, తాటికోల్‌, పెండిపాకల వరకు స్థానిక వాగులను కలుపుకుంటూ.. నాగార్జున సాగర్‌ బ్యాక్‌ వాటర్‌లో కలుస్తుంది.

ఇక ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని.. నల్లగొండ, యాదాద్రి, సూర్యాపేట జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోతకు వచ్చిన వరి పంటలు నీటమునిగాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. జిల్లా వ్యాప్తంగా అనేక చెరువులు, వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో... రాకపోకలు నిలిచాయి. విద్యుత్‌ స్థంబాలు నేలకొరిగాయి. ఎదుళ్లవాగు బ్రిడ్జిపై నుంచి పొంగిప్రవహిస్తోంది. పత్తిపంటలు నీట మునిగాయి. ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు రైతులు. అటు జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ వెంకటేశ్వర్లు.. స్వయంగా పరిశీలించి... అధికారులను అప్రమత్తం చేశారు.

ఇదే జిల్లాలో అశ్వారావుపేట నియోజకవర్గం వ్యాప్తంగా భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రాకపోకలు నిలిచిపోయాయి. కరెంట్‌ తీగలు తెగిపడ్డాయి. పంటపొలాలు నీట మునిగాయి. వరి, చెరకు, అరటి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. బూర్గంపాడు మండలంలో ఎడతెరిపిలేని వర్షాలతో.. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి.

మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్జర్ల నియోజకవర్గంలో భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అల్వాన్‌పల్లి సమీపంలో దుందుభినది పొంగి పొర్లుతోంది. అల్పపీడనం కొనసాగుతుండటంతో.. మరో రెండ్రోజులు పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది.

Next Story

RELATED STORIES