REVANTH: వ్యవస్థలను గాడిన పెడుతున్నాం

REVANTH: వ్యవస్థలను గాడిన పెడుతున్నాం
మెట్రోను, ఫార్మా సిటీని రద్దు చేయడం లేదన్న రేవంత్‌రెడ్డి... మెట్రోలైన్‌ను క్రమబద్ధీకరిస్తున్నట్లు ప్రకటన

తెలంగాణలో ఎయిర్‌పోర్టుకు మెట్రో కానీ.... ఫార్మాసిటీ కానీ రద్దు చేయడంలేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రజాప్రయోజనం దృష్ట్యా హైదరాబాద్‌ మెట్ర్‌లైన్‌ను ఓ క్రమపద్ధతిలోకి తీసుకొస్తామని చెప్పారు. ఫార్మా సిటీ, రీజినల్‌ రింగ్‌ రోడ్‌ మధ్య ప్రత్యేక క్లస్టర్లు ఏర్పాటు చేస్తామన్న CM, యువతలో నైపుణ్యాల మెరుగుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని తెలిపారు. బుధవారం TPCC విస్తృతస్థాయి జరుగుతుందని.. పార్టీ కోసం కష్టపడిన వారితోనే నామినేటెడ్‌ పదవులు భర్తీచేస్తామని చెప్పారు. కొత్త సంవత్సరం వేళ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు.


మెట్రో రైల్‌, ఫార్మా సిటీతో పాటు యువత నైపుణ్యాల మెరుగుకు చర్యలు, నామినేటెడ్‌ పదవుల భర్తీ అంశాలను CM ప్రస్తావించారు. ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మెట్రోలైన్‌ను క్రమపద్ధతికి తీసుకువస్తున్నట్లు చెప్పారు. శంషాబాద్‌ విమానాశ్రయానికి గత ప్రభుత్వం ప్రతిపాదించిన మార్గాలతో పోల్చితే దూరం తగ్గిస్తామని చెప్పారు. BHEL నుంచి విమానాశ్రయానికి 32 కిలోమీటర్లు ఉంటుందని... గచ్చిబౌలి నుంచి మెట్రోలో విమానాశ్రయానికి వెళ్లేవారు దాదాపు ఉండరన్నారు. MGBS నుంచి పాతబస్తీ మీదుగా విమానాశ్రయానికి మెట్రో విస్తరించే అవకాశం ఉంటుందన్నారు. నాగోల్‌, LB నగర్‌, ఒవైసీ ఆస్పత్రి మీదుగా మెట్రో విస్తరించి... చాంద్రాయణగుట్ట వద్ద విమానాశ్రయానికి వెళ్లే మెట్రోకు లింక్ చేస్తామన్నారు. అవసరమైతే మియాపూర్ నుంచి రామచంద్రపురం వరకు మెట్రో పొడిగిస్తామని తెలిపారు. మైండ్ స్పేస్ వరకు ఉన్న మెట్రోను ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ వరకు పొడిగిస్తామని ముఖ్యమంత్రి వివరించారు. కొత్తగా ప్రతిపాదించే మెట్రో లైన్లు.. గత ప్రభుత్వ అంచనాలతో పోల్చితే తక్కువ ఖర్చుతోనే పూర్తవుతాయన్నారు.

ఫార్మా సిటీ, రీజినల్‌ రింగ్‌ రోడ్డు మధ్య మధ్య ప్రత్యేక క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. జీరో కాలుష్యంతో ప్రత్యేక క్లస్టర్లు ఏర్పాటు చేసి... ఇక్కడి పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు ఇళ్ల నిర్మాణంతో పాటు అక్కడే అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. CM పాత క్యాంపు కార్యాలయాన్ని రాష్ట్ర అతిథిగృహంగా మారుస్తామని రేవంత్‌రెడ్డి తెలిపారు. యువతకు నైపుణ్యాలు పెంచేందుకు ప్రత్యేక వర్సిటీలు ఏర్పాటుచేస్తామన్న ఆయన... అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన పారిశ్రామికవేత్తలతో శిక్షణ ఇప్పించనున్నట్లు చెప్పారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ప్రాంగణ నియామకాలు ఉంటాయన్నారు.

Tags

Read MoreRead Less
Next Story