TS: హామీల అమలులో కీలక పాత్ర పోషించాలి

TS: హామీల అమలులో కీలక పాత్ర పోషించాలి
కలెక్టర్లకూ రేవంత్‌రెడ్డి ఆదేశం... అధికారులు-ప్రజా ప్రతినిధులు జోడెద్దుల్లా పని చేయాలని సూచన...

తెలంగాణలో ఆరు గ్యారంటీలు, ఇతర హామీల అమలులో అధికారులు కీలక పాత్ర పోషించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ప్రజాప్రతినిధులు, అధికారులు జోడెద్దుల్లా సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రజల సమస్యల పరిష్కారంలో... అధికారులు మానవీయ కోణంలో చట్టాలు, నిబంధనలను అమలు చేయాలని సూచించారు. తెలంగాణలో గంజాయి అనే పేరే వినిపించవద్దంటూ... పోలీసులకు విస్పష్ట ఆదేశాలు జారీ చేశారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను దుర్వినియోగం చేస్తే ఉపేక్షించవద్దని, సోషల్‌ మీడియా ద్వారా వైషమ్యాలను సృష్టించే వారిపై దృష్టి పెట్టాలని చెప్పారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి కలెక్టర్లు, ఎస్పీలతో రేవంత్‌రెడ్డి సమావేశమయ్యారు. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలోఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహా మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు, అధికారులు పాల్గొన్నారు. ప్రజాపాలన, ఆరు గ్యారెంటీల అమలు, క్షేత్రస్థాయి అంశాలపై అధికారులతో చర్చించారు. ఈ నెల 28 నుంచి జనవరి 6వరకు ప్రజాపాలన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. అన్ని గ్రామాలు, మున్సిపల్‌ వార్డుల్లో ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు కార్యక్రమం నిర్వహించాలని సూచించారు.


గ్రామసభల్లో ప్రభుత్వ సందేశాన్ని...ప్రజలకు చదివి వినిపించాలన్నారు.గ్రామసభల ద్వారా ఆరు గ్యారంటీలకు అర్హులైన లబ్ధిదారులను గుర్తించాలని, వచ్చిన దరఖాస్తుల సమాచారాన్నంతా డిజటలైజ్‌చేయాలని అధికారులను ఆదేశించారు. సచివాలయంలో జరిగే నిర్ణయాలను...క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సింది అధికారులేనని....సీఎం స్పష్టం చేశారు. ప్రజల సమస్యలను మానవీయం కోణంలో చూసి పరిష్కరించాలన్నారు. ప్రభుత్వ పథకాల అమలులో ఇబ్బందులు ఉంటే..ఇతర విధుల్లోకి వెళ్లాలని సూచించారు.

గ్రామసభలకు వచ్చే వారు ఇబ్బంది పడకుండా సౌకర్యాలు కల్పించాలని అధికారులను సీఎం ఆదేశించారు. గ్రామసభల నిర్వహణకు కావాల్సిన నిధులను సీఎం విడుదల చేశారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలలో రెండింటిని ఇప్పటికే అమలు చేశాంమని.. గతంలో 33 శాతం మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారని.. ప్రస్తుతం 58శాతానికి పైగా మహిళలు బస్సుల్లో ప్రయాణిస్తున్నారని తెలిపారు.


నకిలీ విత్తనాల వల్ల రైతులు నష్టపోతున్నారని ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. నకిలీ విత్తనాలు అమ్మేవారిపై ఉక్కుపాదం మోపాలన్న ఆయన డ్రగ్స్‌ సహా మత్తు పదార్థాల వినియోగంపైనా అత్యంత కఠినంగా వ్యవహరించాలని సూచించారు.

సచివాలయంలో జరిగిన సమావేశ వివరాలు వెల్లడించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, గ్రామసభల్లో మారుమూల ప్రాంతాల్లో నివసించేవారి నుంచి కూడా దరఖాస్తులు తీసుకుంటామని వెల్లడించారు. ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం..ఇందుకోసం 25 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Tags

Read MoreRead Less
Next Story