Revanth Reddy: రచ్చబండకు బయలుదేరిన రేవంత్‌ అరెస్ట్‌.. అంబర్‌పేట్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలింపు..

Revanth Reddy (tv5news.in)

Revanth Reddy (tv5news.in)

Revanth Reddy: ఎర్రవెల్లిలో పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి తలపెట్టిన రచ్చబండ నిర్వహించకుండా పోలీసులు అడ్డుకున్నారు.

Revanth Reddy: సీఎం కేసీఆర్‌ దత్తత గ్రామం ఎర్రవెల్లిలో పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి తలపెట్టిన రచ్చబండ నిర్వహించకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఎర్రవెల్లికి వెళ్లడానికి బయలుదేరిన రేవంత్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసి అంబర్‌ పేట్‌ పోలీస్‌ స్టేషన్‌ కు తరలించారు. ఈ ఉదయం నుంచే రేవంత్‌ ఇంటివద్ద హై డ్రామా నడిచింది. భారీగా మోహరించిన పోలీసులు.. రేవంత్‌ ఇంటి నుంచి బయటకు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు.

ఎర్రవెల్లికి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లితీరుతానని రేవంత్‌ భీష్మించారు. రేవంత్‌కు మద్దతుగా భారీగా నేతలు, కార్యకర్తలు ఆయన ఇంటికి చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. రచ్చబండ కార్యక్రమానికి వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకోవడం పట్ల కాంగ్రెస్‌ నేతలు ఫైరయ్యారు. ప్రజాస్వామ్య హక్కుల్ని ప్రభుత్వం కాలరాస్తోందని మల్లురవి మండిపడ్డారు. కాంగ్రెస్‌నేతల హౌజ్‌ అరెస్ట్‌లను తీవ్రంగా ఖండించారు.

రేవంత్‌ ఎర్రవెల్లికి వెళితే కేసీఆర్‌ గుట్టురట్టు అవుతుందనే భయంతోనే ఇంతమంది పోలీసులను పెట్టి అడ్డుకుంటున్నారని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి ఫైరయ్యారు. వరి వేయవద్దని చెప్పిన కేసీఆర్‌...తన వ్యవసాయక్షేత్రంలో వరి వేయడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. కేసీఆర్‌ నాలుగు రోజులు.. మంత్రులు మరో వారం రోజులు ఢిల్లీలో ఉండి ఏంసాధించకుండానే వెనుదిరిగారని, టీఆర్‌ఎస్‌కు రైతులపై చిత్తశుద్ధి ఉంటే ఆ పార్టీ లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలను రాజీనామా చేయించాలని కాంగ్రెస్‌ నేతలు డిమాండ్‌ చేశారు.

మరోవైపు ఉమ్మడి మెదక్‌ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్‌ నేతలను అరెస్టులు, హౌజ్‌ అరెస్టులు చేశారు. ఎర్రవెల్లికి వెళ్లకుండా ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకున్నారు. దుబ్బాకలో జిల్లా ఉపాధ్యక్షులు అనంతుల శ్రీనివాస్‌, మున్సిపల్‌ అధ్యక్షలు ఏసురెడ్డితో పాటు పలువురు నేతలను అరెస్ట్‌ చేశారు. సిద్దిపేటలో పలువురు కాంగ్రెస్‌ నేతలను అదుపులోకి తీసుకున్నారు.

కేసీఆర్‌ ప్రభుత్వ ప్రజావ్యతిరేక చర్యలను వివరించేందుకు ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమాన్ని అక్రమ అరెస్టులతో అడ్డుకోవడం సరికాదన్నారు కాంగ్రెస్‌ నేతలు. అరెస్ట్‌లతో ప్రజా వ్యతిరేకతను నిలువరించలేదన్నారు. అటు ఎర్రవల్లిలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా గ్రామస్తులు నిరసనకు దిగారు. రాజకీయాల కోసం తమ గ్రామస్తుల మధ్య ఘర్షణ పెట్టొద్దని నినాదాలు చేశారు.


Tags

Read MoreRead Less
Next Story