MD Sajjanar : తక్కువ దూరం కోసం పల్లె వెలుగును వినియోగించుకోండి…

MD Sajjanar : తక్కువ దూరం కోసం పల్లె వెలుగును వినియోగించుకోండి…
మహిళలకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ విజ్ఞప్తి

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మీ పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించిన విషయం తెలిసిందే. గుర్తింపు కార్డులను చూపించి మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మహిళా ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు. ఎక్స్‌ ప్రెస్‌ బస్సుల్లో తక్కువ దూరం ప్రయాణించే మహిళలు ఎక్కువగా వెళ్తున్నట్లు టీఎస్ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి వచ్చిందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు.

దీని వల్ల దూర ప్రాంత ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందన్నారు. తక్కువ దూరం ప్రయాణించే వారు పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించి, సిబ్బందికి సహకరించాలని కోరారు. అలాగే, కొందరు మహిళలు అనుమతించిన స్టేజీల్లో కాకుండా మధ్యలోనే బస్సులను ఆపాలని సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నారని తెలిపారు. దీంతో ప్రయాణ సమయం పెరుగుతోందన్నారు. ఇక నుంచి ఎక్స్‌ ప్రెస్‌ బస్సులను అనుమతించిన స్టేజీల్లోనే ఆపడం జరుగుతుందని పేర్కొన్నారు. దూర ప్రాంత ప్రయాణికులకు ప్రాధాన్యత ఇచ్చి సిబ్బందికి సహకరించాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం విజ్ఞప్తి చేస్తోందన్నారు. మరోవైపు, ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులను పెంచేందుకు తెలంగాణ ఆర్టీసీ కసరత్తు చేస్తోంది. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్న ప్రభుత్వం, త్వరలోనే కొత్త బస్సుల ను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. వచ్చే ఏడాది సంక్రాంతి నాటికి 2వందల బస్సులను అందుబాటులోకి తీసుకురానుంది. 50 బస్సులను ఈ నెలాఖరులోపు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎండీ సజ్జనార్ వెల్లడించారు. మరో 6 నెలల్లో దాదాపు 2 వేల బస్సులను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. 512 పల్లె వెలుగు, 400 ఎక్స్‌ప్రెస్‌లు, 92 లహరి స్లీపర్ కమ్ సీటర్, 56 ఏసీ రాజధాని బస్సులు వస్తాయన్నారు. హైదరాబాద్ సిటీలో 540, తెలంగాణలో ఇతర ప్రాంతాలకు 500 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడతామన్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి తీసుకువచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించడానికే కొత్త బస్సులు తెస్తున్నట్లు ఆయన తెలిపారు. బస్ భవన్ ప్రాంగణంలో శుక్రవారం లహరి స్లీపర్, రాజధాని ఏసీ, ఎక్స్‌ప్రెస్‌ బస్సులను సజ్జనార్‌ పరిశీలించారు. ఈ బస్సుల్లో ప్రయాణికులకు కల్పిస్తోన్న సౌకర్యాలపై ఆరా తీశారు.

Tags

Read MoreRead Less
Next Story